
ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో ఖర్చు చేయిస్తున్న సర్కార్
తాజాగా ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు కొనాలని ఉత్తర్వులు
ట్రాక్టర్ల డీజిల్, మెయింటెనెన్స్ కష్టమేనంటున్న సర్పంచ్‌లు
ఇలాగైతే అభివృద్ధి పనులు చేసేదెలాగని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: పంచాయతీల అభివృద్ధికి నెలనెలా నిధులిస్తామని ప్రభుత్వం చెప్పినా, స్థానిక అవసరాలకు తగ్గట్టు ఖర్చు చేసేలా సర్పంచులకు మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ఖర్చుపై పరోక్షంగా అజమాయిషీ చెలాయిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పంచాయతీ కార్మికుల జీతం రూ.8,500 వరకు పెంచడం, ఆ వేతనాలను ప్రభుత్వం నెలనెలా విడుదల చేసే నిధుల నుంచి చెల్లించాలని మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రభుత్వం ఇచ్చే రూ.339 కోట్ల నిధుల్లో 39 వేల మంది సిబ్బందికి జీతాల రూపేణ రూ.33 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా నిధులను అభివృద్ధి పనులకు, యాక్షన్ ప్లాన్ అమలుకు ఖర్చు చేయొచ్చని సర్పంచ్‌లు భావించారు. కానీ తాజాగా ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు కూడా గ్రామ పంచాయతీలకు వివిధ రూపాల్లో వచ్చే నిధులతోనే కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో వారిలో ఆందోళన నెలకొంది.
పెద్దవాటా ట్రాక్టర్ల కొనుగోలుకే..
రాష్ట్రంలో మొత్తం 12,753 గ్రామపంచాయతీలు ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం చెత్త సేకరణకు, హరితహారం మొక్కలకు నీళ్లు పోసేందుకు అన్ని గ్రామాల్లో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేయాల్సి ఉంది. 500కుపైగా జనాభా ఉన్న గ్రామాలకు 15 హెచ్‌పీ మినీ ట్రాక్టర్, 500 నుంచి 3000లోపు జనాభా ఉన్న గ్రామాలకు 20-–21 హెచ్‌పీ ట్రాక్టర్, 3 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామానికి 35–40 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెగ్యులర్ ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే రూ.2 లక్షలు విలువ చేసే ట్యాంకర్, రూ.2 లక్షలు విలువ చేసే ట్రాలీని కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన చిన్న గ్రామాల్లో మినీట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌కు సుమారు రూ.8 లక్షల వరకు, మూడు వేల జనాభా దాటిన గ్రామాల్లో రెగ్యులర్ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌కు రూ.10 లక్షలకుపైగా ఖర్చు కానుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం గ్రామ జనాభా ఆధారంగా నెలానెలా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నిధులు ఇస్తోంది.
ఈ నిధులు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీల ఈఎంఐలకు, సిబ్బంది వేతనాలు, స్ట్రీట్ లైట్లు, జీపీ భవనాల కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, స్ట్రీట్ లైట్స్, యాక్షన్ ప్లాన్ ఖర్చులకు ఎలా సరిపోతాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్నులు పూర్తి స్థాయిలో వసూలైనా నిధులు సరిపోవంటున్నారు. కొత్తగా డ్రైన్ల నిర్మాణం, మట్టి పనులు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, అవసరమైన నిర్మాణాలు ఎలా చేపట్టాలని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉన్న సిబ్బందిలోనే ఒకరికి డ్రైవర్‌గా శిక్షణ ఇవ్వాలన్న ఆదేశాలు కూడా అన్ని గ్రామాల్లో అమలయ్యే పరిస్థితి లేదని, అనుభవజ్ఞులైన డ్రైవర్లను కొత్తగా తీసుకోక తప్పదనే అభిప్రాయం కూడా సర్పంచ్‌ల్లో వ్యక్తమవుతోంది.
ప్రభుత్వమే కొనివ్వాలి
నెలనెలా నిధులు విడుదల చేస్తామని ప్రక టించిన ప్రభుత్వం ఇలా అన్ని ఖర్చులను ఆ నిధుల నుంచే చెల్లించాలని ఆదేశాలి వ్వడం సరికాదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల యాక్షన్ ప్లాన్, రెగ్యులర్‌గా చెల్లించాల్సిన కరెంట్ బిల్లులు, సిబ్బంది వేతనాలు, ఇతర అత్యవసర ఖర్చులకే నిధులు సరిపోయేలా లేవు. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కూడా ఈ నిధుల్లో నుంచి కొనాలనడం సరికాదు. ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసి ఇస్తే.. ఆ నిధులను మేం ఇతర అభివృద్ధి పనులకు వినియోగిం చుకునేందుకు అవకాశం ఉంటుంది.
‑ పర్వతాలు, సర్పంచ్, ముల్కలగూడెం, వరంగల్ అర్బన్