
ములుగు, వెలుగు: ‘పదేండ్లు అధికారంలో ఉండి పనిచేయనోళ్లు.. పేదలకు ఇండ్లు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినోళ్లు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. ప్రజల్లో ఉండే వారే నిజమైన నాయకులని, తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. ములుగులోని లీలా గార్డెన్స్‌లో గురువారం జరిగిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. కష్టపడిన ప్రతీ లీడర్, కార్యకర్తను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్న వారికి పదవులు వాటంతటే అవే వస్తాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ములుగుకు ఇప్పటికే ఐదు వేల ఇండ్లు ఇచ్చామని, మరో వెయ్యి ఇండ్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. జిల్లాలోని బంధాల, వెంకటాపురం, ఇంచించెర్వుపల్లి గ్రామాల్లో ఇండ్లు కాలిపోతే గత ప్రభుత్వం ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చిందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ లీడర్లు ఆత్మహ్యతలను ప్రేరేపిస్తూ ప్రజలను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రేగా కల్యాణితో పాటు డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, తెలంగాణ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సుచిత్ర పాల్గొన్నారు.
విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి
జిల్లా విద్యాశాఖ, దిశ ఫౌండేషన్, ఈఎల్‌ఎఫ్ ఇంగ్లిష్ సౌజన్యంతో ములుగు జిల్లాలోని 50 ప్రైమరీ స్కూళ్లలో చేపట్టిన లర్న్ టు రీడ్90 రోజుల కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అలాగే ములుగులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్ సంస్థతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ స్టూడెంట్లు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలని, ఉన్నత కొలువులు సాధించాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని చెప్పారు. లర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ అర్షం రాజు, సెక్టోరియల్ ఆఫీసర్లు రమాదేవి, గుళ్లపెల్లి సాంబయ్య, ఎంఈవో వజ్జ తిరుపతి, హెచ్‌ఎం ఝాన్సీ పాల్గొన్నారు.