ములుగు/ తాడ్వాయి, వెలుగు: మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను మంత్రి కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి మేడారం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
మేడారంలో స్నేహితులతో మంత్రి ముచ్చట్లు
నిత్యం బిజీ షెడ్యూల్ లో ఉంటూ అతిపెద్ద గిరిజన జాతరను సక్సెస్ చేసుకునేందుకు శ్రమిస్తున్న మంత్రి సీతక్క ఆదివారం కొంచెం రిలాక్స్ గా గడిపారు. తన షెడ్యూల్ లో క్షేత్రస్థాయి పర్యటన చేస్తూనే చిన్ననాటి దోస్తులతో సరదాగా గడిపారు. ములుగులోని బాలికల ఉన్నత పాఠశాలలో తనతో పాటు కలిసి చదువుకున్న మిత్రులు మేడారం రాగా వారితో కలిసి అమ్మవార్ల దర్శనం చేసుకుని, ముచ్చటించారు. కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ఫొటోలు దిగారు. మేడారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రిని స్నేహితురాళ్లు సన్మానించారు.
పగిడిద్దరాజు జాతర పోస్టర్ ఆవిష్కరణ
కొత్తగూడ : మహబూబాబాద్జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర నిర్వహిస్తునట్లు పూజారి పెనుక రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం మేడారంలో జాతర పోస్టర్ను మంత్రి సీతక్క ఆవిష్కరించినట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పగిడిద్దరాజును దర్శించుకోవాలని కోరారు.
