పంచాయతీలు ప్రభుత్వానికి చార్జీలు కట్టాలి

పంచాయతీలు ప్రభుత్వానికి చార్జీలు కట్టాలి
  • జీఎస్టీ, లేబర్, లైబ్రరీ సెస్, సీనరేజ్ చార్జీలు కట్టాలని నోటీసులు  
  • ఒక్కో జీపీ నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలపైనే బకాయిలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలకు నెలనెలా ఫండ్స్ ఇస్తున్నట్లు ప్రకటిస్తున్న రాష్ట్ర సర్కార్ షాకిచ్చింది. జీఎస్టీ, లేబర్, లైబ్రరీ సెస్, ఇతర చార్జీల పేరిట రివర్స్ వసూళ్లకు రెడీ అయింది. ఏడేళ్ల బకాయిలను ఒకేసారి చెల్లించాలని నోటీసులు జారీ చేస్తుండడంతో సర్పంచ్​లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు మెయింటెనెన్స్ భారం పెరిగిన పరిస్థితుల్లో పాత బకాయిల చెల్లింపు వారికి భారంగా మారింది. జీపీ ఖాతాల్లోని డబ్బులన్నీ ఊడ్చిపెట్టినట్లు సర్కార్ ఖాతాలకు మళ్లిస్తే పంచాయతీల నిర్వహణ ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏ ఏడాదికాఏడాది బకాయిలు వసూలు చేస్తే ఇబ్బంది ఉండేది కాదని, ఒకేసారి మోపడం సమస్యగా మారిందంటున్నారు. 

చార్జీల వసూలు ఇలా...
గ్రామ పంచాయతీల్లో వివిధ అవసరాల కోసం సర్పంచ్ లు సామగ్రి కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటిని చాలా మంది జీఎస్టీఐన్ కింద రిజిస్టర్ కాని షాపుల్లో కొనుగోలు చేసినట్లు ఆడిట్ లో తేలింది. దీంతో అప్పుడు వసూలు కాని జీఎస్టీని సెల్ఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ద్వారా రివర్స్ చార్జీలను సర్కార్ విధిస్తోంది. అలాగే గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల వ్యయం రూ.30 వేలు మించినా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మెజార్టీ పంచాయతీలు ఈ ట్యాక్స్ ను జమ చేయడం లేదు. దీంతో ఒక్కో పంచాయతీలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తాన్ని వెంటనే జీఎస్టీ పద్దులో జమ చేయాలని పంచాయతీలను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే డెవలప్​మెంట్ వర్క్స్ బిల్లుల్లో కట్ చేసిన క్వాలిటీ కంట్రోల్(క్యూసీ) చార్జీలు, సీనరేజ్ చార్జీలు, భవన నిర్మాణ కార్మికుల సెస్ బకాయిలను కూడా ఆయా శాఖల ఖాతాల్లో జమ చేయాలని నోటీసుల్లో సూచించింది. పంచాయతీల్లో వసూలు చేసే ఇంటి పన్నుల ఆదాయంలో లైబ్రరీ సెస్ కింద గ్రంథాలయ శాఖలో జమ చేయాల్సిన 8 శాతం మొత్తాన్ని కూడా అందులో పేర్కొంది. ఇవన్నీ కలిపితే ఒక్కో జీపీ లక్షల్లో ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని ఒకేసారి చెల్లించాలని నోటీసులు జారీ చేయడం సరికాదని సర్పంచ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.