క్వారంటైన్ సెంటర్​లోకి అలుగు.. కరోనా టెస్ట్ చేయనున్న డాక్టర్లు

క్వారంటైన్ సెంటర్​లోకి అలుగు.. కరోనా టెస్ట్ చేయనున్న డాక్టర్లు

భువనేశ్వర్: క్వారంటైన్ సెంటర్ లోకి వచ్చిన ఓ అలుగు(పాంగోలిన్)కు కూడా కరోనా టెస్టులు తప్పడంలేదు. ఒడిశాలోని కటక్ జిల్లాలోని క్వారంటైన్ సెంటర్ లోకి సోమవారం రాత్రి ఓ అలుగు వచ్చింది. దానిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అలుగును అడవిలోకి వదిలేముందు దానికి కరోనా టెస్టులు నిర్వహిస్తామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ స్మితా వెల్లడించారు. ‘‘ 42 మంది ఉన్న క్వారంటైన్ సెంటర్ లోకి అలుగు వచ్చింది. ఫారెస్ట్ లోకి వదిలిపెట్టేముందు దానికి సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ హెల్త్ (సిడబ్ల్యుహెచ్) లో కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించాం”అని ఆమె అన్నారు. ఐదు రోజుల కిందట రాయ్‌రాఖోల్ నుంచి కటక్‌కు అలుగులను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు స్మితా మీడియాకు వెల్లడించారు. ఈ రాకెట్ లో అరెస్టయిన వారికి ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టుబడిని అలుగు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తామన్నారు.