Rishabh Pant: ధోని పేరు వినపడినప్పుడల్లా బాధపడేవాడిని: రిషబ్ పంత్ 

Rishabh Pant: ధోని పేరు వినపడినప్పుడల్లా బాధపడేవాడిని: రిషబ్ పంత్ 

రిషబ్ పంత్.. భారత క్రికెట్ అభిమానులకు ఈ పేరొక ఎమోషనల్. అతని రాకకై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్.. త్వరలోనే మైదానంలో అడుగు పెట్టనున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో బ్యాట్ పట్టనున్నాడు. అయితే, ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగిందనే దానిపై పంత్ మొదటిసారి స్పందించాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

కారు ప్రమాదం జ‌రిగిన మరుక్షణం మంటలు చెల‌రేగాయ‌నీ, ఆ స‌మ‌యంలో తన ప్రయాణం ముగిసినట్లు అనిపించిందని రిషబ్ పంత్ అప్పటి ప్రమాద క్షణాల‌ను గుర్తు చేసుకున్నాడు. అయితే, తాను స్పృహలోకి వచ్చాక దేవుడు వెళ్లనివ్వలేదని తన మనస్సులో అనుకున్నట్లు తెలిపాడు. అదే ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోనీతో తన రిలేషన్ షిప్ పై రిషబ్ పంత్ మాట్లాడాడు. ధోనీతో తాను ఎలాంటి విషయాలపైనా చర్చించగలనని, ఆ విషయాలు అతనితో తప్ప మరెవరితోనూ చర్చించలేనని పేర్కొన్నాడు. అయితే, అతని అభిమానులు చూపే అత్యుత్సాహం కొన్ని సంధర్భాల్లో తనను బాధపెట్టినట్లు పంత్ తెలిపాడు.

మొహాలీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పంత్.. కీపింగ్‌లో తప్పిదం చేసినప్పుడు స్టేడియంలోని అభిమానులు ధోని పేరు కలవరించారు. ఆ సమయంలో తాను ఎంతగానో బాధపడినట్లు పంత్ గుర్తు చేసుకున్నాడు. ధోని పాత్రను భర్తీ చేయలేనేమో అన్న ఒత్తిడితో తాను ఊపిరి కూడా సరిగా తీసుకోలేకపోయానని తెలిపాడు. ఆపై కూడా కీపింగ్‌లో తాను తప్పిదాలు చేసిన ప్రతీసారి అభిమానులు ధోని పేరును జపించారని వెల్లడించాడు.

"ఇక్కడ నాకొక విషయం అర్థమయ్యేది కాదు.. ఆ సమయంలో నాకు 20 లేదా 21 ఏళ్లు అనుకుంటా.. తప్పిదాలు జరగడం కామన్. ఎవరూ కావాలని చేయరు. కానీ, అభిమానులు అవేవి అర్థం చేసుకోకుండా స్టంపింగ్‌ మిస్ చేశాక 'ధోనీ, ధోనీ' అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ క్షణాలు నాకు చాలా బాధగా అనిపించేవి. దాన్ని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆ భయం ఏదో ఒక మూల అలానే ఉండేది. మ్యాచ్ పూర్తయ్యాక నేను నా గదిలోకి వెళ్లి ఏడ్చేవాడిని.." పంత్ తెలిపారు. అతని చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.