- ప్యారడైజ్ టు బోయిన్పల్లి వరకూ 5.4 కి.మీ కారిడార్
- ప్రాజెక్టు పనులతో ట్రాఫిక్ మళ్లింపులపై హెచ్ఎండీఏ, ట్రాఫిక్ పోలీసుల చర్చలు
- బోయిన్పల్లి వెళ్లే వాహనాలు తాడ్‌బండ్ టు అన్నానగర్ మీదుగా మళ్లింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ ప్యారడైజ్జంక్షన్నుంచి బోయినపల్లి డెయిరీ ఫారం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్కారిడార్–1 ప్రాజెక్టు పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్మళ్లింపులకు హెచ్ఎండీఏ, ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాయిల్టెస్టింగ్ దాదాపు పూర్తయిందని అధికారులు తెలిపారు.
ప్యారడైజ్ నుంచి బోయినపల్లి డెయిరీ ఫారం వరకు 5.4 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ పనులు చేపట్టాలంటే ఈ ప్యారడైజ్జంక్షన్నుంచి బోయిన్పల్లి వరకూ ట్రాఫిక్ సమస్యలు లేకుండా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించాలి.
ఈ మేరకు హెచ్ఎండీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్మళ్లింపులు చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. ట్రాఫిక్డీసీపీ, ఏసీపీ వంటి ఉన్నతాధికారులు హెచ్ఎండీఏ అధికారులతో కలిసి ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నారు.
అన్నా నగర్లో కొత్తగా రోడ్ల నిర్మాణం, రిపేర్లు
ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా బాలంరాయి నుంచి తాడ్బండ్వరకూ, అక్కడి నుంచి బోయిన్‌పల్లికి వెళ్లే దారుల్లో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ముఖ్యంగా తాడ్‌బండ్ నుంచి బోయిన్‌పల్లికి వెళ్లే వాహనాలను అన్నా నగర్ మీదుగా బోయిన్‌పల్లికి మళ్లించాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ మేరకు ఇప్పటికే అన్నా నగర్లో రోడ్లను మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణం, కొన్ని చోట్ల రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్టు తెలిపారు.
రూ.1,550 కోట్లతో ప్రాజెక్టు
ప్యారడైజ్– బోయిన్పల్లి డెయిరీ ఫారం కారిడార్‌కు సంబంధించి భూ సేకరణ పనులు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. రక్షణ శాఖ అధికారులతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు పనుల ప్రారంభానికి లైన్క్లియర్అయ్యింది. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా అధికారులు పూర్తిచేశారు.
ప్రస్తుతం సాయిల్టెస్ట్ పనులు కూడా పూర్తి కావచ్చినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 5.4 కి.మీ. ఈ కారిడార్‌ను పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బేగంపేట ఎయిర్ వద్ద తాడ్‌బండ్ వైపున 600 మీటర్ల మేర అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. మొత్తం 652 కోట్ల ఈ ప్రాజెక్టును భూసేకరణతో కలిపి రూ.1,550 కోట్లతో నిర్మించనున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వస్తే ఆయా ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద సిగ్నల్స్‌ను తొలగించే అవకాశం ఉంటుంది. ఎన్‌హెచ్–44 రోడ్లో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండదని తెలిపారు.

