పరకాల పట్టణ కేంద్రంగా పరకాల జిల్లాను ప్రకటించాలని మొదటి నుంచి అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. 2016లో ప్రభుత్వం 31 జిల్లాలు ప్రకటించాక అందులో పరకాల లేకపోవడం పరకాల ప్రాంత ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలు పరకాలను జిల్లాగా ప్రకటించాలని ఉద్యమాలు చేస్తూ తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. పరకాల భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రాశస్త్యం పరిశీలిస్తే పరకాలకు జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి.
పరకాల ప్రాంతం చలివాగు ఒడ్డున ఉండటం వల్ల పరకాల జిల్లాగా మారితే తాగునీటికి ఢోకా ఉండదు. దానికి కారణం ఒకవైపు చలివాగు ప్రవాహం, ఇంకోవైపు పరకాల పెద్దచెరువు, మరోవైపు దామెర చెరువు, అదేవిధంగా పైడిపల్లి చెరువు మద్యలో పరకాల పట్టణం ఉంది. ఇదేకాకుండా పరకాల ప్రాంతానికి చలివాగు ప్రాజెక్ట్ ఒక వరం. ఇంకా వంద ఏండ్లు అయినా ఇక్కడి ప్రజలకు తాగునీటికి ఇబ్బంది ఉండదు. ఈ పరిస్థితి పరకాల పట్టణానికి ఒక వరం. జిల్లా కేంద్రంగా మార్చడానికి అనుకూలం.
పాలనాపరంగా పరిశీలిస్తే పరకాల ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో టౌన్ కమిటీ అని మున్సిపాలిటీ స్థాయిలో ఉండేది. పరకాల ఒకనాడు పాత తాలూకా కేంద్రం. ఒకప్పటి పరకాల, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి, శాయంపేట, రేగొండ, ఆత్మకూరు మండలాల కింది ఉన్న దాదాపు 200 గ్రామాలన్నీ అప్పటి పరకాల తాలూకా కిందే ఉండేది. పరకాలలో తహసీల్దారు కార్యాలయం చాలా పురాతనమైనది. మొదటి నుంచి ఇక్కడ ఒక డాక్ బంగ్లా ఉండేది. పన్నులు వసూలు చేయడానికి చావడి ఉండేది. 1976లో పరకాలలో కొంత కాలం సబ్ కలెక్టర్/ ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసి మళ్లీ 1987లో ఎత్తివేశారు.
పరకాల జిల్లా కోసం ఉద్యమ ఫలితంగా ఇక్కడ ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి పాలకులు చేతులు దులుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించిన గడ్డ పరకాల. తొలి దశ ఉద్యమంలో పోలీస్ తుపాకి గుండుకు ఒకరు అమరులైనారు. అప్పుడే అనేకమంది విద్యార్థులు జైలు పాలయ్యారు. ఇక మలి దశ ఉద్యమంలో సైతం పరకాల తనవంతు పాత్ర పోషించిన మాట వాస్తవం. 1948 పూర్వం రజాకార్ల కాలంలో సైతం పరకాల ప్రాంత ప్రజలు చాలా చురుకైన పాత్ర పోషించిన మాట అక్షర సత్యం.
పరకాల నుంచి మెరుగైన రవాణా సదుపాయం
జలియన్‌వాలా బాగ్ తరహాలో పరకాల పట్టణంలో జరిగిన కాల్పులకు ఒకేరోజు దాదాపు 23 మంది అమరులైనారు. వందలాది ప్రజలు గాయపడ్డారు. దీనికి నిలువెత్తు సాక్ష్యం ప్రస్తుతం ఇక్కడ నిర్మించిన పరకాల అమరధామం. పరకాల జనాభా లక్షకు మించింది. ఇప్పుడు ఇది మున్సిపాలిటీ. భూపాలపల్లికి, అదే జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి , కాళేశ్వరం ప్రాజెక్ట్ కు, మంథని, మహాదేవపూర్లకు పరకాల నుంచే వెళ్లాలి. ఇక్కడి నుంచి హుజురాబాద్‌కు హైవే ఉంది. పరకాల.. హుజురాబాద్‌కు, హన్మకొండకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరకాలకు సమీప రైల్వే స్టేషన్ ఉప్పల్.
ఇది దాదాపు 15 కిలోమీటర్లలో ఉంది. ఇక్కడి నుంచి వయా పరకాల భూపాలపల్లికి రైల్వే లైన్ వేసి, హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడలకు రవాణా పెంచవచ్చు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర, దేశస్థాయిలో వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు ఉన్నారు. పరకాల కన్నా చిన్న స్థాయిలో ఉండే మహబూబాబాద్, జనగాం, ములుగు, నారాయణపేట, వనపర్తి, గద్వాల, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ లాంటి ప్రదేశాలకు జిల్లాస్థాయి ఇచ్చిన ప్రభుత్వం.. అన్ని అర్హతలు కలిగిన పరకాలను నిర్లక్ష్యం చేయడం ఇక్కడి ప్రజల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
ప్రజల ఆకాంక్షను ప్రజా ప్రభుత్వం నెరవేర్చాలి
పరకాల జిల్లాలో పాత మండలాలుగా ఉన్న పరకాల, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, శాయంపేట, దామెర, ఆత్మకూరు, నడికుడి, కమలాపురం మండలాలు కలిపి ఒక నూతన జిల్లా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు, తగిన జనాభా ఉంది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో ఉన్న రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి మండల ప్రజలు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రం చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరకాల ఆనుకునే ఉన్న దమ్మన్నపేటకు ఎక్కువగా పరకాల కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రజలు, మొగుళ్లపల్లి అలాగే చిట్యాల మండలం గ్రామాల్లో ప్రజలు వెనుకకు ప్రయాణించి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది.
రెవెన్యూ డివిజన్ కేంద్రం కోసం కూడా అంతే దూరం వెళ్లడం తప్పటం లేదు. ముఖ్యంగా మొగుళ్ల పల్లి , చిట్యాల మండల పరిధిలో అనేక గ్రామాల చుట్టూ వాగులు ఉండటం వల్ల వర్షాకాలంలో నిత్యావసర వస్తువులు అక్కడే స్టోర్ చేసే పద్ధతి ఉంది. పరకాల జిల్లా కేంద్రం అయితేవాళ్లకు ఎంతో దగ్గరగా, సౌకర్యవంతంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5,50,000 మించి, ఇప్పటి జనాభా అంచనాల ప్రకారం ప్రతిపాదిత పరకాల జిల్లాలో సుమారు 7 లక్షల 50 వేలకుపైగా జనాభా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పరకాలను జిల్లా కేంద్రంగా ప్రకటించి పరకాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలి.
ఎర్రా నాగేంద్రబాబు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.
