
టీచర్.. తప్పు చేసిన స్టూడెంట్ ని మందలించడం పాత అలవాటు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మందలించిన టీచర్ ని.. విద్యార్థి తల్లిదండ్రులు వెంబడించి కొట్టడం కొత్త అలవాటు. ఇలాంటి ఘటనే తమిళనాడు టుటికోరిన్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ లో జరిగింది. ఆ స్కూల్ లో పనిచేస్తున్న భరత్ అనే టీచర్.. రెండో తరగతి చదువుతున్న పిల్లాడ్ని కొట్టాడని విద్యార్థి తల్లిదండ్రులు సెల్వీ, శివలింగం ఆరోపించారు. దాంతో విషయం తెలుసుకోకుండా స్కూల్ కి వెళ్లి టీచర్ భరత్ తో గొడవకు దిగారు.
చిన్న పిల్లలను కొట్టడం చట్టవిరుద్దమని, పిల్లల్ని కొట్టే హక్కు టీచర్ కు ఎవరిచ్చారంటూ.. విద్యార్థి తల్లి సెల్వీ టీచర్ భరత్ ను చెప్పుతో కొట్టడానికి వెళ్లింది. స్కూల్ పిల్లలు చూస్తుండగానే శివలింగం భరత్ పై దాడి చేశాడు. స్కూల్ గ్రౌండ్ లో భరత్ ను పరిగెత్తించి కొట్టారు. పెద్ద రాయిని భరత్ పై విసిరిన దృశ్యాలు దాడి చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి.
ఈ విషయంపై స్కూల్ టీచర్లంతా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వర్తించకుండా నిరోధించినందుకు, బెదిరింపులు, నేరపూరిత కుట్ర వంటి నేరాలపై విద్యార్థి తల్లిదండ్రులు, అతని తాతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, ఏడేళ్ల చిన్నారి క్లాస్ రూమ్ లో ఇతర పిల్లలతో తరచూ గొడవపడుతుండటంతో.. సీటు మారాల్సిందిగా భరత్ కోరాడు. సీటు మారుతున్న టైంలో చిన్నారి కింద పడిపోయి చిన్న దెబ్బ తాకింది. అయితే, ఇంటికి వెళ్లిన విద్యార్థి టీచర్ తనను కొట్టాడని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ టీచర్ పై దాడి చేశారు. ఈ విషయాలన్నీ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ బాలాజీ శరవణన్ చెప్పారు.