ఈసారైనా ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గుతాయా.. లేదా!: కాంగ్రెస్ పై పేరెంట్స్ కోటీ ఆశలు

ఈసారైనా ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గుతాయా.. లేదా!:  కాంగ్రెస్ పై పేరెంట్స్ కోటీ ఆశలు

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తామని గత సర్కారు మాటిచ్చింది. కానీ నిలబెట్టుకోలేకపోయింది.  ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం, మేనేజ్మెంట్ల నుంచి ఒత్తిడి నేపథ్యంలో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్, స్టూడెంట్లు ఆందోళనలు మొదలుపెట్టారు. దీంతో ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు ఇవ్వాలని 2017లో  ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు నేతృత్వంలో అప్పటి కేసీఆర్ సర్కారు కమిటీని వేసింది. ఆ కమిటీ పలు రాష్ర్టాల్లోని ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసి, సర్కారుకు ప్రతిపాదనలు ఇచ్చింది. కానీ, కమిటీ ప్రతిపాదనలను సర్కారు పట్టించుకోలేదు. దీంతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశాయని హైకోర్టు గుర్తించినా, వాటిపై నాటి సర్కారు చర్యలు సైతం తీసుకోలేదు.  

 రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై పేరెంట్స్ లో ఆశలు మొదలయ్యాయి.  ఈసారైనా ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గుతాయా.. లేదా! అని  కాంగ్రెస్ పై పేరెంట్స్ కోటీ ఆశలు పెట్టుకున్నారు.  కొత్త ప్రభుత్వం ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించినట్టే.. స్కూల్ ఫీజులను కూడా నియంత్రించాలని పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు10,600 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా, వాటిలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో బడ్జెట్ ప్రైవేటు స్కూళ్లలో  రూ.20 వేల నుంచి రూ.70 వేల దాకా ఫీజులు ఉండగా, కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా ఉన్నాయి. 

మంత్రుల కమిటీ వేసినా.. 

రెండేండ్ల క్రితమే ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పేరెంట్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై14 మంది మంత్రులతో ప్రభుత్వం కమిటీని వేసింది. రెండు, మూడుసార్లు కమిటీ సమావేశమైనా, ఫలితం మాత్రం రాలేదు. దీంతో బీఆర్ఎస్ తీరుపై పేరెంట్స్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పేరెంట్స్ లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. కనీసం వచ్చే 2024–25 విద్యాసంవత్సరానికి అయినా, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులను కంట్రోల్ చేయాలని కోరుతున్నారు.