విడిపోయి వేరే పెళ్లిళ్లకు సిద్దపడ్డ తల్లిదండ్రులు: ఇద్దరు పిల్లల్ని అమ్మేసి..

విడిపోయి వేరే పెళ్లిళ్లకు సిద్దపడ్డ తల్లిదండ్రులు: ఇద్దరు పిల్లల్ని అమ్మేసి..

కన్న బిడ్డల కంటే వివాహేతర సంబంధాలే ఎక్కువనుకున్నారు ఆ ఇద్దరు. అప్పటి వరకు కలిసి ఉన్న భార్యాభర్తలు తమ పిల్లల గురించి కూడా ఆలోచించకుండా వివాహేతర బంధం పెట్టుకున్న వారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అందుకు భారంగా అనిపించిన పిల్లల్ని అమ్మేసి.. ఆ ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఈ ఘటన ఒరిస్సాలోని మల్కాన్ గిరి జిల్లాలో జరిగింది. ఆ తల్లిదండ్రులు అమ్మేసిన పసివాడు కొత్త వ్యక్తి పెట్టే బాధలు భరించలేక తప్పించుకోవడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఆ పిల్లాడి తమ్ముడిని కూడా మరొకరి దగ్గరి నుంచి రక్షించి చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉంచారు అధికారులు. మల్కాన్‌గిరికి చెందిన సుక్రా భూమ్య, అతడి భార్యకు 9 ఏళ్లు (వసుదేవ్), 7 ఏళ్ల (జగన్నాథ్) వయసున్న పిల్లలున్నారు. అయితే వారిద్దరూ కొన్నాళ్లుగా ఇతరులతో సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో విడిపోయి వాళ్లనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో కొద్ది రోజుల క్రితం వేర్వేరు వ్యక్తులకు ముందుగా చిన్న కొడుకు జగన్నాథ్, ఆ తర్వాత పెద్ద కొడుకు వసుదేవ్‌ను కూడా అమ్మేశాడు. అయితే వసుదేవ్‌ను తీసుకున్న వ్యక్తి చిన్నపిల్లాడన్న జాలి లేకుండా ఇంటి పని, పశువుల దగ్గర పనులు అన్నీ చేయించేవాడు. చెప్పిన పనులు పూర్తి చేస్తే కానీ తిండి కూడా పెట్టేవాడు కాదు. దీంతో అతడి వద్ద బండెడు చాకిరీ చేయలేక, తిండీతిప్పలు సరిగా లేక అల్లాడిపోయిన ఆ పిల్లాడు.. ఎవరూ లేని సమయంలో పారిపోయాడు. ఓ అంగన్‌వాడీ సెంటర్‌ దగ్గర కూర్చుని ఏడుస్తుండగా అక్కడ పనిచేసే అంగన్‌వాడీ వర్కర్ జయంతి ఖరా ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని తల్లిలా ఓదార్చింది. జరిగిన విషయం తెలుసుకుని  అక్కడే ఉంచి చూసుకుంటూ వచ్చింది. అయితే ఆదివారం నాడు ఆ పిల్లాడిని కొనుకొన్న వ్యక్తి వసుదేవ్ అక్కడున్న విషయం తెలుసుకుని వచ్చాడు. అతడిని అప్పగించాలంటూ జయంతిని కోరాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో గొడవకు దిగాడు. స్థానికులు జయంతికి అండగా నిలిచి అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ టీమ్ అక్కడికి చేరుకుని ఘటనపై విచారణ జరిపంచారు. అనంతరం వసుదేవ్‌ను చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌కు తరలించారు. అయితే తనకంటే ముందే తమ్ముడు జగన్నాథ్‌ను మరో వ్యక్తికి అమ్మిన విషయం వసుదేవ్ అధికారులకు చెప్పడంతో వాళ్లు అ పిల్లాడిని కూడా గుర్తించేందుకు ఎంక్వైరీ చేశారు. సిరాగూడ అనే గ్రామంలో జగన్నాథ్‌ను ఓ వ్యక్తి గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడని తెలిసి విడిపించి, చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌కు చేర్చారు. ఈ పిల్లలిద్దరూ తాము బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తామని చెబుతున్నారు. తమ ఊరికి మాత్రం వెళ్లబోమని భయం భయంగా చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని, తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తామని, అవసరమైతే వారిద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. అయితే ఆ పిల్లలు కోరుకుంటే వాళ్ల రిలేటివ్స్ ఇంటికి పంపుతామని చెప్పారు.