ఇంటర్ లో ఫీజుల కట్టడి లేనట్టే

ఇంటర్ లో ఫీజుల కట్టడి లేనట్టే
  • ఫీజుల చట్టం కేవలం ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లకే 
  • జూనియర్‌‌‌‌ కాలేజీలకూ వర్తింపజేయాలని పేరెంట్స్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ ఉంటుందని భావించిన పేరెంట్స్​కు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీల్లో నియంత్రణ కోసం చట్టం చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించినా, ఆచరణలో మాత్రం స్కూళ్లకే పరిమితమైనట్టు స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన మంత్రుల కమిటీలో కేవలం ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లలో ఫీజులపైనే చర్చ జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కువ ఫీజుల దోపిడీ కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లోనూ జరుగుతుందని, వీటిని కట్టడి చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. స్టేట్‌‌‌‌ లో 1,250 ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలుండగా, వీటిలో ఆరున్నర లక్షల మంది చదువుతున్నారు. వీటిలో కేవలం 250 వరకు మాత్రమే కార్పొరేట్ కాలేజీలుండగా, వాటిలోనే సగం మంది విద్యార్థులున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో అప్పటి సర్కారు 104 జీవోను తీసుకొచ్చింది. దీనిప్రకారం ఏటా పదిశాతం ఫీజులు పెంచుకునే అవకాశముంది. 2014 నాటికి ఫస్టియర్​లో రూ.1,760, సెకండియర్​లో రూ.1,940 మాత్రమే ఫీజు తీసుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జీవో ప్రకారం ఫీజులు పెంచలేదు. ఒకవేళ పెంచినా రూ.5వేలకు మించి పెరగదు. ప్రస్తుతం స్టూడెంట్లకు 2014 నాటి ఫీజులకే సర్కారు రీయింబర్స్​మెంట్ ఇస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేల నుంచి రూ.40వేల వరకూ ఫీజు ఉంది. కానీ కార్పొరేట్ కాలేజీల్లో మాత్రం రూ.రూ.60వేల నుంచి రూ.3లక్షల వరకు ఉంది. ఎంసెట్, నీట్, జేఈఈ కోచింగ్ పేరుతో రూ.5లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే వీటిని నియంత్రించే యంత్రాంగమే లేకపోవడం గమనార్హం.

కేబినేట్​ ప్రకటనలో ఒకటి.. అమలు మరొకటి 

గత నెలలో జరిగిన కేబినేట్ మీటింగ్ లో ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. కానీ ఈనెల 2న జరిగిన ఫీజుల నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో కేవలం స్కూల్ ఫీజుల పైనే చర్చించారు. దీనికి సంబంధించిన మినిట్స్ బయటకు రావడంతో ఈ విషయం తెలిసింది. స్టేట్​లో కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల దోపిడీపై అనేక విమర్శలున్నాయి. ఇంటర్ బోర్డునూ మేనేజ్మెంట్‌‌‌‌ లు పట్టించుకోవనే ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆయా కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సులకు అడ్మిషన్లే తీసుకోవడం లేదు. అయినా ఆ కాలేజీలను పట్టించుకునే వారే కరువయ్యారు. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దోపిడీపై సర్కారు పెద్దలకు కంప్లైంట్లు అందినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజుల నియంత్రణ చట్టం వస్తే ఈ బాధలు తప్పుతాయని పేరెంట్స్ భావించారు. కానీ వారి ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది.