కామారెడ్డిలో లీజు మిల్లులతో పరేషాన్

కామారెడ్డిలో లీజు మిల్లులతో పరేషాన్
  • సీఎంఆర్​ రికవరీకి ఇబ్బందులు
  • ఈ నెల చివరతో ముగియనున్న గడువు

కామారెడ్డి, వెలుగు: ఎన్నిసార్లు గడువు విధించినా జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్​ మిల్లింగ్ ​రైస్) టార్గెట్​ రీచ్​ కావడం లేదు. నెలలు గడుస్తున్నా ఎఫ్​సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్​విషయంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని కొన్ని రైస్​మిల్లులు ఓనర్ల నుంచి లీజుకు తీసుకున్న వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇలా జిల్లాలోని 163 మిల్లుల్లో 30 మిల్లులను వేరే వ్యక్తులు లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. 

ఈ మిల్లుల నుంచి సీఎంఆర్ ​రికవరీ చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. లీజుకు తీసుకొని సీఎంఆర్​ ఆడిస్తున్న మిల్లర్లు, రైస్​అప్పజెప్పే విషయంలో బాధ్యత వహించడం లేదు. జిల్లాలో 2022–23 వానాకాలం సీజన్​లో ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి 4,73,242 మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించింది. ఈ వడ్లను సీఎంఆర్​ కోసం జిల్లాలోని 163 రైస్​మిల్లులకు అప్పగించారు. మిల్లర్లు వడ్లను బియ్యంగా మార్చి తిరిగి 3,18,914 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. 

ప్రభుత్వం పలు దఫాలుగా గడువు విధించినా మిల్లర్లు టార్గెట్ ​మేర బియ్యం తోలలేదు. డిసెంబర్​లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం సీఎంఆర్​ను సీరియస్​గా తీసుకుంది. జనవరి నెలాఖరు కల్లా ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్​ రీచ్​ కావాలని ఉన్నతాధికారులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా, డివిజన్, మండల స్థాయి రెవెన్యూ ఆఫీసర్లతో స్పెషల్ టీమ్స్​ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేయించారు. బియ్యం రికవరీ కోసం మిల్లర్లపై  ఒత్తిడి తెచ్చారు. గత నెల చివరి వరకు 89 శాతం టార్టెట్​రీచ్​ అయ్యారు. ప్రభుత్వం ఈ నెల చివరి వరకు మరో అవకాశం ఇచ్చింది.

గడువు ఎనిమిది రోజులే..

2022–23 వానాకాలం సీజన్​కు సంబంధించి 3,18,914 మెట్రిక్ ​టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 2,91,635 మెట్రిక్​ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. ఇంకా 27 వేల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ పెండింగ్​లో ఉంది. గడువు ఇంకా ఎనిమిది రోజులే మిగిలి ఉండడంతో వంద శాతం టార్గెట్​ రీచ్​ అవుతారా అనే సందిగ్ధత నెలకొంది. పెండింగ్​లో ఉన్న సీఎంఆర్​ కేవలం 25 నుంచి 30 రైసుమిల్లుల నుంచే రావాల్సి ఉంది. 

ఇందులో లీజుకు తీసుకొని నడిపిస్తున్న మిల్లులే ఎక్కువగా ఉన్నాయి. సీఎంఆర్​ పెండింగ్​లో ఉన్న మిల్లులు జుక్కల్ నియోజకవర్గంలోనే అధికంగా ఉన్నాయి. కొన్ని మిల్లుల్లో కేటాయింపులు, స్టాక్​ లెక్కలకు మధ్య పొంతన కుదరడం లేదు. గతంలో కొందరు సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు మిల్లులకు ఇష్టారితీన వడ్లను కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడువు లోగా టార్గెట్​ కంప్లీట్ ​చేయని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.