పరిగి ఎమ్మెల్యేకు మరో పరాభవం.. గ్రామానికి రావొద్దని అడ్డుకున్న ప్రజలు

పరిగి ఎమ్మెల్యేకు మరో పరాభవం.. గ్రామానికి రావొద్దని అడ్డుకున్న ప్రజలు

పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో బుధవారం (జూన్ 21న) ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయని ఎమ్మెల్యే రావొద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నాలుగున్నర ఏళ్లు దాటినా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తమ గ్రామానికి రావొద్దంటూ మహేష్ రెడ్డిని అడ్డుకున్నారు. సమస్యలు చెబుతున్న కండ్లపల్లి గ్రామస్తులపై ఎమ్మెల్యే అనుచరుడు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుండగా ఎమ్మెల్యే అనుచరుడు గ్రామస్తులపై దాడి చేయడంతో బాధితులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. సమస్యలు చెప్పడానికి వస్తే దాడి చేస్తారా...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనతో పరిగి ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గ్రామస్తులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య చాలాసేపు తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పల్లెబాట చేయకుండానే అధికార ఎమ్మెల్యే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. 

మరోవైపు.. బుధవారం (జూన్ 21న) ఉదయం మీర్జాపూర్ లో జరిగిన పల్లెబాటలో కూడా సమస్యలపై గ్రామస్తులు ఎమ్మెల్యే  మహేష్ రెడ్డిని నిలదీశారు.