వారి ఓట్లే కీలకం.. వలస ఓటర్లపైనే గెలుపు ఆశలు!

 వారి ఓట్లే కీలకం.. వలస ఓటర్లపైనే గెలుపు ఆశలు!

హైదరాబాద్/ పరిగి : రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే హైదరాబాద్, ముంబై, పుణె నగరాలకు ప్రత్యేక వాహనాలు పంపించి మరి వలస ఓటర్లను తీసుకొస్తారు. బస్సులు, ట్రైన్ లో వచ్చేవారి రాను.. పోను ఖర్చులు అభ్యర్థులే భరిస్తారు. వలస ఓటర్లకు కేరాఫ్ గా పరిగి సెగ్మెంట్ ఉంది. దీని పరిధిలో పూడూరు, కులకచర్ల, దోమ, చౌడాపూర్, మహ్మదాబాద్, గంఢీడ్, పరిగి మండలాలు ఉండగా.. ఇక్కడి ప్రజలు హైదరాబాద్, ముంబై, పుణె నగరాలతో పాటు సౌదీ , కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు ఉపాధికి వలస పోతుంటారు.  అయితే.. పరిగి సెగ్మెంట్​లో బీసీలు, ఎస్సీ ఓటర్లు కీలకంగా ఉండగా.. 60శాతానికిపైగా వీరే ఉంటారు.  బీసీల్లో అధికంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 65 వేలు, ఎస్సీలవి 40 నుంచి 50 వేలు ఉంటాయి.  

గెలుపు ఓటములను డిసైడ్ చేసేది వీరే. ఆయావర్గాల ఓటర్లపైనే అన్ని పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. వీరి ఓట్లు నిర్ణయాత్మకంగా ఉండగా అభ్యర్థులు ఎవరైనా తమకు వారి ఓట్లు పడితే చాలు గెలుపు తమదే ధీమాతో ఉంటారు.  ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్​సిట్టింగ్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాంమోహన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ పోటీలో నిలిచారు. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్​ మధ్యే గట్టి పోటీ ఉంది. ఆయా పార్టీల క్యాండిడేట్లు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

అయితే.. అధికార బీఆర్ ఎస్ నుంచి పెద్ద లీడర్లు పార్టీని వీడటం ఆ పార్టీకి పెద్ద మైనస్ అయింది.  పరిగి, కులకచర్ల, దోమ మండలాల్లో దాదాపు బీఆర్ఎస్​ఖాళీ అయింది. గతంలో ఇక్కడి నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించిన దివంగత నేత కమతం రాంరెడ్డి కొడుకు మొన్నటివరకు బీఆర్ ఎస్ లో ఉండి, కాంగ్రెస్ లో చేరారు. దోమ ఎంపీపీ , కులకచర్ల ఎంపీపీ, పరిగి వైస్ ఎంపీపీ, పలువురు సర్పంచులు బీఆర్ఎస్ ను వీడి హస్తం గూటికి చేరారు.  

ఎమ్మెల్యేపై వ్యతిరేకతనే..

భూముల కబ్జా, ప్రభుత్వ పథకాలను ఇష్టానుసారంగా ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపై సొంత పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. అయితే.. మహేశ్​ రెడ్డి  ప్రభుత్వ పథకాలపై పూర్తి నమ్మకం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. తన తండ్రి హరీశ్వర్ రెడ్డి మరణం కూడా ఈ ఎన్నికల్లో మహేశ్​రెడ్డిపై ప్రభావం చూపనుంది. 2018 ఎన్నికల్లో మహేశ్​ రెడ్డి తరఫున ఆయన తండ్రి హరీశ్వర్ రెడ్డి ప్రచారం చేసి గెలిపించారు. మరోవైపు కాంగ్రెస్​ఆరు గ్యారంటీలతో జనంలోకి వెళ్తున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. 

సెగ్మెంట్ ఓటర్లు ఇలా..

మొత్తం                   2,34, 652  
పురుషులు             1,19,512  
మహిళలు              1,14,8 65  
ట్రాన్స్ జెండర్లు     8 
ఎన్‌ఆర్‌ఐ              7 
సర్వీసు ఓటర్లు    260