తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు : ప్రధాని మోడీ

తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు : ప్రధాని మోడీ

'పరీక్షా పే చర్చ' తనకు కూడా పరీక్షేనని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఆశించడం సహజమే.. కానీ స్టేటస్ కోసం వారిని ఒత్తడి చేయొద్దని సూచించారు. రాజకీయాల్లో తమక్కూడా ఒత్తిడి ఉంటుందని, కానీ ఆ ఒత్తిడితో మీ సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని విద్యార్థులకు చెప్పారు. జీవితంలో టైం మేనేజ్‌మెంట్ అత్యంత ప్రధానమని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తమ తల్లులు ఇంట్లో ఎలా టైం మేనేజ్ చేస్తూ... పనులు నిర్వర్తిస్తారో గమనించాలని విద్యార్థులకు సూచించారు. ఒత్తిడిలో ఉండకండి.. ఒత్తిడిలో ఆలోచించకండి.. ముందు విశ్లేషించండి, పని చేయండి.. మీరు ఆశించిన దాన్ని సాధించేవరకు మీ వంతు కృషి చేయండని మోడీ సూచించారు.

ఇక పరీక్షల్లో కాపీ కొట్టడంపైనా ప్రధాని మోడీ మాట్లాడారు. కాపీ చేస్తే ఒక్కసారి, లేదా రెండు సార్లు పరీక్షలో నెగ్గొచ్చు, కానీ జీవితాన్ని నెగ్గలేరని చెప్పారు. షార్ట్‌కట్‌ను ఎప్పుడూ తీసుకోవద్దని, విద్యార్థులు కష్టపడి జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఒత్తిడిని మోడీ క్రికెట్ తో పోల్చారు. క్రికెట్ మైదానంలో ఉన్న బ్యాటర్ .. ఆడియెన్స్ అరుపులను పట్టించుకోకుండా అతనికి ఎదురుగా వస్తున్న బంతిపైన్ ఫోకస్ చేస్తాడన్నారు. అదే విధంగా విద్యార్థులు కూడా ఒత్తిడిని పక్కనబెట్టి, చదువుపై దృష్టి సారించాలని చెప్పారు.