ఇయ్యాల్టి నుంచే : హాట్ హాట్ గా పార్లమెంట్ సమావేశాలు

ఇయ్యాల్టి నుంచే : హాట్ హాట్ గా పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ, వెలుగు: సీఏఏ ఆందోళనలు, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్​బడ్జెట్​ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్​ సమావేశాలు ఏప్రిల్​ 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 21 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర పభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతోంది. ఢిల్లీ అల్లర్లకు పూర్తి బాధ్యత కేంద్రానిదే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు అస్సాంలో డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో సుమారు 45 బిల్లులు, 7 ఆర్థిక పద్దులను కేంద్రం పెట్టనుంది. మైనింగ్​ సవరణ యాక్ట్​2019 ఆర్డినెన్స్, దివాలా, సరోగసీతోపాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

సీఏఏ, విభజన అంశాలపై టీఆర్‌‌‌‌ఎస్ ఆందోళన

సీఏఏపై ప్రతిపక్షాలతో కలిసి టీఆర్ఎస్​ ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. ఈ దిశలో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు విభజన చట్టంలో పొందు పరిచిన అంశాలనూ టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తనున్నారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గించే అంశంపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది. అంశాలవారీగా ఉభయ సభలో తమ వ్యూహాలు ఉంటాయని ఎంపీలు చెబుతున్నారు.

అమిత్ షా రాజీనామా చేయాలి: కాంగ్రెస్

ఢిల్లీ అల్లర్ల కు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధీర్ రంజన్​ చౌదురి తెలిపారు. లా అండ్​ ఆర్డర్​ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఆందోళనకారులు, పోలీసు ఉన్నతాధికారుల్లో కొందరు కుమ్మక్కై అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్. భావిస్తోంది.