పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాక ఎట్లొచ్చిన్రు?: ఖర్గే

పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాక ఎట్లొచ్చిన్రు?: ఖర్గే

 

  • కేంద్రం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది?: ఖర్గే
  • ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బిహార్ వెళ్లారు
  • దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా? మీకున్న దేశభక్తి ఇదేనా?

న్యూఢిల్లీ:  టెర్రరిజాన్ని నామ రూపాల్లేకుండా చేస్తుంటే.. పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాకా వచ్చి ఎలా దాడి చేశారని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. పహల్గాం దాడికి 3 రోజుల ముందు ప్రధాని మోదీ తన జమ్మూ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారని నిలదీశారు. ప్రధాని పర్యటన రద్దు చేసుకుంటే.. పర్యాటకులను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పహల్గాం దాడి కచ్చితంగా భద్రతా వైఫల్యమని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారని ఖర్గే పేర్కొన్నారు. ఆపరేషన్‌‌ సిందూర్‌‌పై చర్చలో భాగంగా మంగళవారం రాజ్యసభలో ఖర్గే మాట్లాడారు. ‘‘పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. వారికి నివాళులర్పిస్తున్నాను. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తన భర్త డెడ్​బాడీని ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి చనిపోయి పడి ఉంటే.. గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారులను చూశాను. నిస్సహాయురాలిగా ఉన్న మహిళలను చూశాను. దీనంతటికి కారణం బీజేపీనే. ఎన్డీయే అధికారంలోకి వచ్చాకే ఇండియాలో టెర్రర్ దాడులు పెరిగాయి. మా హయాంలోనే ఆయుధ కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. బీజేపీ మాత్రం అబద్ధపు కార్ఖానాలు ఏర్పాటు చేసింది’’ అని ఖర్గే అన్నారు.

ఆర్మీని అవమానిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?

పహల్గాం దాడి.. ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని ఖర్గే అన్నారు. ‘‘బీజేపీ ఎంపీలు, మంత్రులు ఇండియన్ ఆర్మీని అవమానిస్తుంటే మోదీ నోరు మెదపలేదు. జవాన్ల త్యాగాలను బీజేపీ అపహాస్యం చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా.. పహల్గాం దాడికి బాధ్యత వహించాలి. ఆల్ పార్టీ సమావేశానికి హాజరుకాకుండా బిహార్ వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ఇదేనా మోదీ దేశభక్తి? పహల్గాం దాడిని ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్‌‌కు ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇలా ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్‌‌ దేశాన్ని నిర్మించిన పార్టీ. మా పార్టీకి చాలా చరిత్ర ఉంది. మేం ఎప్పుడూ పాక్‌‌కు సపోర్ట్‌‌ చేయలేదు. ఆహ్వానించకుండా పాక్‌‌కు వెళ్లడం సిగ్గుచేటు. మాపై నిందలు వేస్తూ.. పాక్‌‌ నేతలను కౌగిలించుకుంటారు. మీరు తప్పు చేసి మాపై అసత్య ప్రచారాలు చేస్తారా? ఇదేనా మీ దేశ భక్తి?’’అని ఖర్గే నిలదీశారు. 

ట్రంప్ ఇప్పటిదాకా 29 సార్లు అన్నడు

కాంగ్రెస్‌‌ను నిందిస్తూ ఎంత కాలం బతకాలనుకుంటున్నారని బీజేపీ నేతలను ఖర్గే నిలదీశారు. ‘‘దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా? పాకిస్తాన్​తో కాల్పుల విరమణ జరిగితే ఎవరు ప్రకటన చేయాలి? విదేశాంగ శాఖ మంత్రో, ప్రధానో, లేకుంటే రక్షణ మంత్రినో అనౌన్స్ చేయాలి. కానీ.. ఎక్కడో వాషింగ్టన్‌‌ నుంచి ట్రంప్‌‌ ప్రకటించారు. కాల్పుల విరమణ తన విజయమేనని ట్రంప్‌‌ ఇప్పటిదాకా 29సార్లు ప్రకటించుకున్నారు. ఈ నా ప్రసంగం ముగిసేలోపు ఆయన మరోసారి ప్రకటించుకుంటే 30వ సారి అవుతుంది. అయినా ఆ నిజాన్ని కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు? ట్రంప్ చేస్తున్న ప్రకటనలన్నీ అబద్ధాలు అని మోదీ 
ఎందుకు అనడం లేదు?’’అని ఖర్గే అన్నారు.

ఖర్గే వర్సెస్ జేపీ నడ్డా

రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడిపై చర్చ జరుగుతుంటే ప్రధానమంత్రి మోదీ బిహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఏంటని ఖర్గే నిలదీశారు. ఖర్గే కామెంట్లపై జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మీ మానసిక పరిస్థితి బాగాలేనట్లు ఉంది’’ అని నడ్డా చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం చెలరేగింది. దీంతో తన వ్యాఖ్యలను వాపస్​ తీసుకుంటున్న ట్లు  నడ్డా ప్రకటించారు. సభాముఖంగా ఖర్గేకు క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.