సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో పార్లమెంట్‌!

సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో పార్లమెంట్‌!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఉదయం రెండు గంటలు లోక్ సభ, మధ్యాహ్నం రెండు గంటలు రాజ్యసభ సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంట్  వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు వారాలపాలు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తితో దాదాపు 8 రోజులు ముందుగానే కేంద్రం బడ్జెట్ సమావేశాలను ముగించింది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు తప్పనిసరిగా ఉభయ సభలు సమావేశంకావాల్సి ఉంది. మార్చి23 న బడ్జెట్  సెషన్ వాయిదా పడగా… వచ్చే నెల 12 లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలోనే వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చర్చించినట్లు తెలిసింది. ఎంపీల సూచనలు, ఆరోగ్య పరిస్థితులు ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చి నట్లు తెలిసింది. కేంద్రం తాజాగా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ లతో  పాటు పలు కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు తీసుకురానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

జాగ్రత్తల మధ్య…

కరోనా వ్యాప్తి చెందుతున్నందున అనేక జాగ్రత్తల మధ్య పార్లమెంటు సమావేశాలు నిర్వ హించాలని కేంద్రం నిర్ణయిం చి నట్లు తెలిసింది. సెంట్రల్ హాల్ లోకి కేవలం సిట్టింగ్ ఎంపీలను మాత్రమే అనుమతించనున్నట్లు సమాచారం. ఉదయం లోక్ సభ సభ్యులను, సాయంత్రం రాజ్యసభ సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. దీంతో ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఒకరికొరు తారసపడే అవకాశం ఉండదు. మధ్యాహ్నం అవసరమైతే పార్లమెంట్ లో శానిటైజేషన్, ఇతర ప్రివెంటివ్ మెజర్స్ ను తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మెంబర్స్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించే చర్యలతో పాటు పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, ఎంట్రీ గేట్ల వద్దశానిటైజర్ ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. మీడియా విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోను న్నట్లు తెలిసింది. రాజ్యసభ ప్రెస్ గ్యాలరీలోకి కేవలం ఏడుగురు, లోక్ సభ గ్యాలరీలోకి 15 మందికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో లోక్ సభ, రాజ్యసభ, దూరదర్శన్, మీడియా ఏజెన్సీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆవరణలోకి మాత్రం ఎక్స్ ఎంపీలు, మీడియా పాస్ హోల్డర్లకు ఎంట్రీ ఉండనున్నట్లు సమాచారం.