
తరగతి గదుల్లో నిత్యం విద్యార్థుల రాతల్ని మార్చుతున్నా పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల వెతలు మాత్రం ఇంకా మారడం లేదు. తమ కుటుంబానికి దూరంగా.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ రాత్రింబవళ్లు పాఠశాలను అంటిపెట్టుకున్నా ‘బతకలేక బడిపంతుళ్లు’ అన్నట్లుగా తయారయ్యింది గురుకుల పార్ట్ టైమ్ టీచర్ల దుస్థితి. రెగ్యులర్ వాళ్ళతోనూ సమంగా విధులు నిర్వహిస్తున్నా, చాలీచాలని జీతాలు ఇస్తున్నా భరిస్తున్నారు. ఆ జీతాలు సైతం సమయానికి రాకపోవడం వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తమ బతుకులు మారుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
4వేల మంది తాత్కాలిక ఉపాధ్యాయులు
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 268 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 3,733 మంది పార్ట్ టైమ్ టీచర్లు, మరి కొందరు గెస్ట్ ఫ్యాకల్టీతో కలిపి మొత్తం 4 వేల మంది ఉపాధ్యాయులు తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తోంది. అందులో మొదటగా అకడమిక్ ప్రారంభంలో జూన్ నెల 15 రోజుల జీతం మాత్రం ఇచ్చారు. ఇంకా జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు అంటే 3 నెలల జీతాలు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే దసరా పండుగకు కనీసం పిల్లలకైనా కొత్త బట్టలు కొనలేని దుస్థితిలో ఇబ్బందులు పడ్డామని కొందరు టీచర్లు వాపోతున్నారు. మా ఉద్యోగాన్ని నమ్ముకుంటే పండుగ రోజు కూడా ఇంటిల్లిపాది పస్తులుండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కనీసం బండిలోనూ పెట్రోల్ పోయించలేని దీన స్థితిలో ఉన్నామని చెబుతున్నారు.
నెలవారీగా జీతం వస్తేనే గడిచే నిరుపేద కుటుంబాలు మూడు నెలలుగా అగమ్య గోచరంగా మారాయి. చే బదులుగా తీసుకున్న డబ్బులతో కొన్ని రోజులుగా కాలం వెళ్లదీస్తున్నామనీ, డబ్బులు అప్పుగా ఇచ్చినవారు సైతం మీకు జీతాలు రావు. మాకివ్వరు అని హేళన చేస్తున్నారనీ పలువురు టీచర్లు వాపోతున్నారు. ఎవర్నీ అడగలేక, ఎవరికీ చెప్పుకోలేక కొన్నిసార్లు పస్తులుండాల్సి వస్తోందని అల్లాడుతున్నారు.
జీతభత్యాల్లోనూ చిన్నచూపే..
రాష్ట్రంలో 5 రకాల సొసైటీలున్నాయి. జ్యోతి రావ్ పూలే బీసీ, ట్రైబల్, మైనార్టీ, జనరల్ గురుకులాలతో పోల్చితే సాంఘిక సంక్షేమ గురుకులంలో మాత్రమే జీతాలు తక్కువ ఇస్తున్నారు. 5 రకాల గురుకులాల్లో ఉమ్మడి సమయ పాలన, పని విధానం అమలు చేస్తున్నప్పటికీ జీతాల విషయంలో ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు.
మైనారిటీ గురుకులంలో జూనియర్ లెక్చరర్లకు నెలవారీ జీతం రూ. 36 వేలు, పీజీటీలకు జీతం రూ.29 వేలు కాగా సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ లెక్చరర్లకు మాత్రం రూ.23 వేలు, పీజీటీలకు రూ.18 వేలు మాత్రమే ఇవ్వడం వివక్ష కాదా? ఈ విషయాన్ని ఇప్పటికైనా పరిష్కరించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికైనా జరిగిన పొరపాటును సరిచేసి ప్రతి నెలకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు నేరుగా పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల ఖాతాల్లోనే నెలవారీ జీతాలు వేయాలని అధికారులను, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
అశాస్త్రీయంగా పనివేళలు
అన్ని గురుకులాల్లోనూ పనివేళలు కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి. ఉదయం 8 గంటలకు పాఠశాలకు వెళితే 4:30 వరకూ స్కూల్, ఇందులో సూపర్ విజన్, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్, వారానికి ఒక్కో రోజు స్టే పేరిట అక్కడే పడుకోవాల్సి వస్తుంది. అంటే సుమారు 25 –- 30 కిలోమీటర్ల నుంచి బయలుదేరే టీచర్ ఇంటి నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 9గంటలకు స్టడీ ముగిశాక ఇంటికి చేరేసరికి రాత్రి 10 అవుతోంది.
సుమారు రోజుకు 24 గంటల్లో 15 గంటలు పాఠశాలలోనే గడపాల్సి వస్తోంది. వీటికి తోడు నిత్యం రికార్డుల పేరిట ఏదో రకంగా పని ఉండే ఉంటుంది.ఒకవైపు చాలీచాలని జీతాలు, మరోవైపు అధికంగా పని భారం ఉన్నా కుటుంబాలను గడపడానికి ఆధారంగా ఉన్నటువంటి ఈ గురుకులంలో ఉద్యోగాలు చేస్తూ నానా అవస్థలు పడుతున్నామని కొందరు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికైనా పనివేళలు విద్యార్థులు, సిబ్బంది మానసిక వికాసానికి, సంసిద్ధతకు సరిపోయేవిధంగా ఉండేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.
మా గోడు వినండి
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా కిందిస్థాయి నుంచి వెళ్లినవారే. కిందిస్థాయి ఉద్యోగుల బాధలు, వ్యధలు తెలిసినవారే. అయినప్పటికీ ఎవరూ కూడా మా పట్ల సానుకూలంగా పనిచేయడం లేదని పార్ట్ టైమ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదని, చిన్న చిన్న ప్రకటనలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాయని పార్ట్ టైమ్ టీచర్లు చెబుతున్నారు.
ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మా పార్ట్ టైమ్ టీచర్లకు జీతాలు నెలవారీగా సకాలంలో అందేలా చూడాలనీ, ప్రిన్సిపాల్ ఖాతాలో కాకుండా వీలైతే నేరుగా ఉపాధ్యాయుల ఖాతాల ద్వారానే జీతాలు అందజేయాలని కోరుతున్నారు. పని వేళలను సైతం సాధ్యమైనంత త్వరగా మార్చాలని కోరారు.
ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల మానసిక, శారీరక సంసిద్ధతకు, వికాసానికి అనుగుణంగా సమయ పాలనను మార్చాలని అభిలషిస్తున్నారు. మా బతుకులన్నీ ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోకుండా తమకు తగినవిధంగా న్యాయం చేస్తారని పార్ట్ టైమ్ ఉపాధ్యాయ వర్గాలు కోరుకుంటున్నాయి. రానున్న రోజుల్లో అన్ని రకాలుగా న్యాయం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పార్ట్‌టైమ్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
ఒకవేళ దిక్కుతోచక పార్ట్ టైమ్ టీచర్లు వేరే ఉద్యోగాలను వెతుక్కుంటే మధ్యలో ఈ విద్యా సంవత్సరం సాగేదెలా..? ఈ నెల నుంచి జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, రోజువారీగా జరిగే పరీక్షల నిర్వహణలో తలెత్తే ఇబ్బందులకు బాధ్యులెవరు..? అనే ప్రశ్న తలెత్తుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకునేకంటే ముందుగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, పార్ట్టైమ్టీచర్లను ఆదుకుని సకాలంలో నెలవారీగా జీతాలు ఇచ్చేలా చూడాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుకుంటున్నారు.
- త్రినేత్రం