రోహిత్ సపోర్ట్ చేస్తేనే టీమిండియాకు బుమ్రా దొరికాడు: భారత మాజీ వికెట్ కీపర్

రోహిత్ సపోర్ట్ చేస్తేనే టీమిండియాకు బుమ్రా దొరికాడు: భారత మాజీ వికెట్ కీపర్

ప్రస్తుత ప్రపంచంలో టాప్ బౌలర్లలో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా ఒకడనడంలో అసలు సందేహమే లేదు. తన పదునైన పేస్ బౌలింగ్ తో బ్యాటరలను వణికించే ఈ గుజరాత్ ఫాస్ట్ బౌలర్.. కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా బుమ్రా బౌలింగ్ లో ధాటిగా ఆడే సాహసం బ్యాటర్లు చేయరు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి టీమిండియాలో చోటు సంపాదించాడు. అయితే బుమ్రా ఐపీఎల్ లో పడిన ఇబ్బందుల గురించి టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ ప్రారంభానికి మరో వారం రోజులు ఉండగా..పార్థివ్ పటేల్ బుమ్రా గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. "బుమ్రా 2013లో ముంబై తరపున IPL అరంగేట్రం చేసాడు. రైట్ ఆర్మ్ పేసర్ మూడు వికెట్లు మాత్రమే తీసి 10 ఎకానమీ రేట్‌తో తీవ్రంగా నిరాశ పరిచాడు. తర్వాతి (2014) సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2015లో బుమ్రా కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఓవర్‌కు 12.26 ఎకానమీ రేట్ తో దారుణంగా విఫలమయ్యాడు. 

2015 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ మధ్యలోనే బుమ్రాను వదిలేయాలనుకుంది. అయినప్పటికీ, రోహిత్ శర్మ.. బుమ్రాని కొనసాగించాలని సపోర్ట్ చేశాడు. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి సీజన్ నుంచి కీలకంగా మారింది. ఆ తర్వాత బుమ్రా ఎలా బౌలింగ్ చేసాడో అందరికీ తెలిసిందే". అని పార్థివ్ పటేల్ అన్నాడు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ తరపునే ఆడాడు. ఇప్పటివరకు 120 మ్యాచ్ ల్లో 145 వికెట్లు పడగొట్టాడు. ఒకసారి 5 వికెట్ల ఘనత తీసుకున్న బుమ్రా ఎకానమీ 7.4 గా ఉంది. 2016 లో ధోనీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాపై టీ20 ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.