తెలంగాణలో ఊళ్లు కిక్కెక్కుతున్నయ్ .. గ్రామాలకు చేరిన ఎన్నికల మద్యం

తెలంగాణలో ఊళ్లు కిక్కెక్కుతున్నయ్ .. గ్రామాలకు చేరిన ఎన్నికల మద్యం
  • ప్రలోభాలు షురూ చేసిన పార్టీలు
  • పోలింగ్ వరకు నిషాలో ఉంచేందుకు ప్లాన్

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ టైమ్​దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీల క్యాండిడేట్లు మద్యం డంప్​ల డోర్లు తెరిచారు. అయిదు రోజులే మిగిలుండడంతో ఓటర్లను మందు నిషాలో ముంచెత్తడానికి విలేజ్ లకు కోటర్ సీసాలు పంపించారు. సీసాలు ఎక్కడ నిల్వ ఉన్నాయనే లీకులు ప్రత్యర్థులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మే నుంచి జిల్లాలో అఫీషియల్​గా రూ.900 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగింది. ఇందులో రూ.150 కోట్ల విలువైన మందు పొలిటికల్ పార్టీల వద్దే ఉన్నట్లు సమాచారం.

లోకల్ లీడర్ల వద్ద స్టాక్

సిట్టింగ్ ఎమ్మెల్యేలైన బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక శాతం స్థానిక సంస్థల ప్రతినిధుల వద్దకు లిక్కర్ సీసాలు చేర్చారు. బుధ, గురువారాల నుంచి కుల సంఘాల సభ్యులకు సీసాలు ఇవ్వడం షురూ చేశారు. గ్రామాల్లో రోజుకు పది కాటన్​ల చొప్పున (ఒక్క కాటన్​లో 48 సీసాలు) పంపిణీ చేస్తున్నారు. కుల సంఘాల సభ్యులకు రాయల్​స్టాగ్​కోటర్లు పంపిణీ చేస్తుండగా, కాస్త పలుకుబడి ఉన్న లీడర్లకు బ్లెండర్స్​ప్రైడ్, యూత్​కు సిగ్నేచర్ బాటిళ్లు ఇస్తున్నారు. పోలింగ్​కు రెండు రోజుల ముందు మేక, గొర్రెపోతులు అందించి ప్రతీ కుటుంబానికి మటన్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓటర్లను ఖుషీ చేయడం తమకూ తప్పదనే ఆలోచనతో మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులూ గురువారం నుంచి సప్లయ్​స్టార్ట్ చేశారు. ఎంపిక చేసిన మూడు సెగ్మెంట్లలో లిక్కర్​పంపిణీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది.

షెడ్యూల్​కు ముందే కొనుగోళ్లు

ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్లాన్​తో ఉన్న లీడర్లు లిక్కర్ కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక మద్యం కొనుగోలు, తరలింపు, డంప్ చేయడం కష్టమవుతోందని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరు నెలల నుంచి ప్రతినెలా లిక్కర్ కొనుగోలు చేసి సీక్రెట్​గా డంప్ చేశారు. మే నెలకు ముందు ఉమ్మడి జిల్లాలో రూ.123 కోట్లున్న లిక్కర్​ సేల్స్ తర్వాత నెల నుంచి ఏవరేజ్​గా రూ.145 కోట్లకు పెరిగాయి. ఇదంతా పాలిటికల్ పార్టీలకు చెందిన కొనుగోళ్లేనని స్పష్టంగా అర్థమవుతుంది. జిల్లాలో ఒక పార్టీ అభ్యర్థి రూ.18 కోట్ల మందు కొన్నట్లు తెలుస్తోంది. మిగతావారు రూ.10 కోట్ల విలువకు కాస్త అటుఇటుగా సేకరించి పెట్టుకున్నారు. 

నిఘా ఫెయిల్

జిల్లా ఆఫీసర్లు ఈ నెల రోజుల్లో రూ.2.25 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. కానీ అసలైన డంప్​ల జాడ సేకరించడంలో విఫలమవుతున్నారు. ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ అబ్జర్వర్లుగా వచ్చిన పెద్దాఫీసర్లు వారం కింద మాక్లూర్ మండల కేంద్రంలోని ఉమ్మడి జిల్లా లిక్కర్ డిపోను విజిట్ చేశారు. ఏ ప్రాంత వైన్సులలో లిక్కర్ కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు రికార్డులు పరిశీలించారు. గడిచిన ఆరు నెలల సేల్స్ సమాచారాన్ని చూసి ఆశ్చర్యపోయారు.