ఇండిగో సిబ్బందిపై ప్రయాణికుడి ఆరోపణలు

ఇండిగో సిబ్బందిపై ప్రయాణికుడి ఆరోపణలు

ఇటీవలి కాలంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ దివ్యాంగ చిన్నారిని విమానం ఎక్కేందుకు నిరాకరించి.. చివరికి డీజీసీఏ జరిమానా విధించే వరకు తెచ్చుకుంది. అయితే తాజాగా ఇండిగో చేసిన మరో పని వైరల్ గా మారింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న తన ఆరేళ్ల కుమార్తెకు, విమాన సిబ్బంది ఆహారం అందించలేదని... ఓ ప్రయాణికుడు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మొదట కార్పొరేట్ ప్రయాణికులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని సిబ్బంది తెగేసి చెప్పారని.. దాంతో తన కుమార్తె విమానంలో ప్రయాణం చేసినంత సేపు ఆకలితో ఏడుస్తూనే ఉందని తెలిపారు. 

ఈ ప్రయాణికుడి ట్వీట్ కు స్పందించిన ఇండిగో సంస్థ.. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి.. త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాం. భవిష్యత్తులో మీకు మెరుగైన సేవలందించేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపింది.