ఇండియాలో వాహనాల అమ్మకాలు తగ్గినయ్​

ఇండియాలో వాహనాల అమ్మకాలు తగ్గినయ్​

న్యూఢిల్లీ: ఇండియాలో వాహనాల అమ్మకాలు గత నెలలో 19.08 శాతం పడిపోయాయని సియామ్‌ శుక్రవారం ప్రకటించింది. ఎకానమీలో స్లోడౌన్‌ కొనసాగుతుండడంతో వాహనాలకు డిమాండ్‌ తగ్గిందని తెలిపింది. దీంతోపాటు వచ్చేనెల నుంచి బీఎస్‌–6 రూల్స్‌ అమల్లోకి వస్తుండడంతో బీఎస్‌–4 వాహనాల ప్రొడక్షన్‌ తగ్గిందని పేర్కొంది. 2019  ఫిబ్రవరిలో వాహనాల అమ్మకాలు 20,34,597 గా ఉండగా, గత నెలలో 16,46,332 వాహనాలుగా నమోదయ్యాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌(సియామ్‌) తెలిపింది.  కరోనా దెబ్బతో సప్లయ్‌ చెయిన్‌లో అంతరాయం ఏర్పడిందని, కంపెనీల ప్రొడక్షన్‌ తగ్గడానికి ఇది కూడా కారణమని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా చెప్పారు.

మూడోస్థానానికి కియా మోటార్స్‌..

సియామ్‌ విడుదల చేసిన డేటా ప్రకారం..డొమెస్టిక్‌ ప్యాసెంజర్‌‌ వెహికల్స్‌ అమ్మకాలు 7.61 శాతం తగ్గి గత నెలలో 2,51,516 వాహనాలుగా రికార్డయ్యాయి. గత ఏడాది  ఫిబ్రవరిలో 2,72,243 వాహనాలు అమ్ముడయ్యాయి. కార్ల అమ్మకాలు గత నెలలో 8.77 శాతం తగ్గి 1,56,285 వాహనాలుగా ఉన్నాయి. కాగా 2019 ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు1,7 1,307 యూనిట్లుగా నమోదయ్యాయి.  మారుతి సుజుకీ ప్యాసెంజర్ వెహికల్స్‌ అమ్మకాలు గత నెలలో 2.34 శాతం తగ్గి 1,33,702 వాహనాలుగా ఉండగా, హ్యుండయ్‌ మోటర్‌‌ ఇండియా అమ్మకాలు 7.19 శాతం తగ్గి  40,010 వాహనాలుగా ఉన్నాయి. కొత్తగా ఇండియన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కియా మోటర్స్‌ గత నెలలో 15,644 వాహనాలను అమ్మి మూడోస్థానంలో నిలిచింది.

టూవీలర్‌ కంపెనీలకూ నిరాశే…

టూ వీలర్ల ‌ అమ్మకాలు కూడా ఫిబ్రవరిలో 19.82 శాతం పడిపోయి 12,94,791 వాహనాలుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో 16,14,941 వాహనాలను అమ్మారు. హీరో మోటర్‌‌ కార్ప్‌ సహా అన్ని టూవీలర్​ కంపెనీల సేల్స్​ తగ్గాయి.