మీరు ఉండాల్సినోళ్లే : ఏసీ బోగీలను.. జనరల్ బోగీల్లా వాడేస్తున్నారు

మీరు ఉండాల్సినోళ్లే : ఏసీ బోగీలను.. జనరల్ బోగీల్లా వాడేస్తున్నారు

రైలులో ప్రయాణించాలంటే టికెట్టు ఉండాల్సిందే. లేదంటే టీటీఈ వచ్చి జరిమాన వేస్తాడు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేస్తాడు. అలా భయపడి అందరం ఇష్టం లేకున్న టికెట్టు కొంటాం. కానీ ఓ చోట మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. రైలులో టికెట్ కొని ప్రయాణించే వారికంటే టికెట్ లేకుండా ప్రయాణించే వారు ఎక్కువ సంఖ్యలో పోగయ్యారు. ఒకేసారి మందగా అంతా ట్రైన్ లోకి చొచ్చుకెళ్లారు. దీంతో ట్రైన్ ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. దీంతో టికెట్ కొన్న ప్రయాణికులు ట్రైన్ ముందుకెళ్లి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతకి ఎక్కడో తెలుసా.. 

రాజస్థాన్‌లోని రింగాస్ రైల్వే స్టేషన్ సమీపంలో విపరీతమైన రద్దీ కనిపించింది. అజ్మీర్-ఢిల్లీ మార్గంలో ఉన్న చేతక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడింది. ఖాటు శ్యామ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులంతా ఒక్కసారి ట్రైన్ ఎక్కడంతో రైలంతా కిటకిటలాడింది. నడవడానికి కూడా దారి లేనంతగా మారిపోయింది. రైలు ఎక్కిన ప్రయాణికులలో టికెట్ ఉన్నవారికంటే లేని వారే ఎక్కువ మంది ఉన్నారని తోటి ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు.  రైలులోని ఏసీ కోచ్ లు కూడా యాత్రికులుతో కిక్కిరిసిపోయింది.  

 దీంతో టికెట్ కొని ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రైలు కోచ్‌లలోకి  టికెట్ లేని ప్రయాణికులు వచ్చి తాము రిజర్వ్ చేసిన సీట్లను ఆక్రమించారని వాపోయారు. నిలబడే బాధ తట్టుకోలేక ట్రైన్ ముందుకెళ్లి నిరసన తెలిపారు. టీటీఈ టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.  దాదాపు 30 నిమిషాల పాటు రైలును ఆపివేశారు.  రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసన తెలుపుతున్న ప్రయాణికులుకు నచ్చజెప్పారు. వారిని శాంతింపజేసి రైలును ముందుకు పంపించారు. ఆ ట్రైన్ కు సంబంధించిన వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు ఉండాల్సినోళ్లే : ఏసీ బోగీలను.. జనరల్ బోగీల్లా వాడేస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.