
వ్యాపారానికే ఉత్తరాఖండ్ గేట్ ర్యాంకర్ ఓటు
ప్రధాని నరేంద్ర మోడీ మాటలే స్ఫూర్తిగా తీసుకున్నాడేమో.. ఇంజనీరింగ్ చదివినా, గేట్లో మంచి ర్యాంకు కొట్టినా ఆ యువకుడు పకోడీ వ్యాపారం చేసుకుంటూ బతికేస్తున్నాడు. అప్పట్లో ప్రధాని వ్యాఖ్యలకు చాలా మంది నిరుద్యోగులు పకోడీలతో నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, వారికి భిన్నంగా అందులో తప్పేముందంటూ.. ఉత్తరాఖండ్‌కు చెందిన సాగర్ షా అనే యువకుడు పకోడీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. గేట్లో మంచి ర్యాంకు వచ్చి ఎంటెక్ సీటొచ్చినా కాదనుకుని బద్రినాథ్ హైవేపై ఉన్న తన సొంతూరు పిపల్‌కోటిలో పకోడీ షాపును నడుపుతున్నాడు. ఇప్పుడు బద్రీనాథ్ సీజన్ నడుస్తుండడంతో.. అతడి కొట్టుకు గిరాకీ బాగా పెరిగింది. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతోంది. సీజన్ కాకపోయినా అతడి పకోడీ కొట్టుకు మంచి పేరే వచ్చింది. నిజానికి ఆ పకోడీ షాపు వాళ్ల నాన్న పెట్టింది. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివేటప్పుడే టైం దొరికినప్పుడు షాపులో తన వంతు సాయం చేసేవాడు.
‘‘నాకు ఇంజనీరింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అమ్మానాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఆర్థికంగా కూడా అండగా ఉన్నారు. వాళ్లిచ్చిన ప్రోత్సాహంతోనే గేట్లో 8000 ర్యాంకు సాధించా. ఎన్ఐటీలో సీట్ వచ్చే చాన్స్ ఉన్నా ఎంటెక్ చేయాలన్న ఆలోచన మాత్రం నాకు లేదు” అని సాగర్ చెబుతున్నాడు. ఎంటెక్ చేయడమంటే మరో రెండేళ్లు వృథా చేసుకోవడమేనంటున్నాడు. దానికి బదులు ఏదైనా ఉద్యోగం చూసుకుని తన కుటుంబానికి అండగా నిలబడడమే మేలని చెప్పాడు. ఉద్యోగం దొరికే దాకా పకోడీ షాపులోనే పనిచేస్తానని చెబుతున్నాడు. అయినా, పకోడీ కొట్టును నడపడం కూడా ఒక సవాల్‌తో కూడుకున్న పనేనని, వంట వాళ్లు, కూలీలు దొరకడం చాలా కష్టమైపోయిందని, వాళ్ల పని మనమే చేసుకుంటే తప్పేంటని సాగర్ చెబుతున్నాడు.