పసుపు బోర్డు హామీ నెరవేర్చా.. చెరుకు ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తా : అర్వింద్​

పసుపు బోర్డు హామీ నెరవేర్చా.. చెరుకు ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తా : అర్వింద్​

కోరుట్ల, వెలుగు: కోరుట్లలో దొరల పాలనను అంతం చేయడానికే వచ్చానని నిజామాబాద్​ ఎంపీ , కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో అర్వింద్​ నామినేషన్​ వేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ హాజరయ్యారు. అర్వింద్ ​మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్​ అభ్యర్థులు ఒక్కటేననీ, సీఎం కేసీఆర్​ఇద్దరికీ డబ్బులు పంపిస్తున్నాడని ఆరోపించారు. చిట్టాపూర్‌‌లో ఫ్యాక్టరీ కోసం గుంజుకున్న భూములను తిరిగి అప్పగిస్తామని, పసుపు బోర్డు హామీ నెరవేర్చానని, మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలయ్యాక డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని, వ్యవసాయ ఆధారిత ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఎన్ఆర్ఐ సెల్, మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

ఆవాస్​ యోజన కింద తెలంగాణలో మొదటి దశలో 15 లక్షలు ఇండ్లు కట్టిస్తామన్నారు. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన దొంగ కేసులు ఎత్తేసి, పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరించారు. బీడీ కార్మికులకు స్పెషాలిటీ  హాస్పిటల్​ ఏర్పాటు చేస్తామని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్​, కౌన్సిలర్​ రుద్ర సుజాతతో పాటు పలువురు పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. కొత్త బస్టాండ్​ నుంచి నంది చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. అంతకు ముందు ఎంపీ అర్వింద్​ దంపతులు సంకల్ప విఘ్నేశ్వరాలయంలో పూజలు చేసి ఆర్డీవో ఆఫీస్​లో నామినేషన్​ వేశారు. జగిత్యాల, బాల్కొండ అభ్యర్థులు బోగ శ్రావణి, అన్నపూర్ణమ్మ, లీడర్లు సురభి నవీన్​, సుఖేందర్​గౌడ్​,  సునీత, రఘు, రాజశేఖర్, నరేశ్​ పాల్గొన్నారు.