టీమిండియాలో ఆ ఇద్దరి నిలకడ అత్యద్భుతం: ఆస్ట్రేలియా కెప్టెన్

టీమిండియాలో ఆ ఇద్దరి నిలకడ అత్యద్భుతం: ఆస్ట్రేలియా కెప్టెన్

ఇటీవలే ముగిసిన ఐసీసీ అవార్డ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు 2023 మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. కమ్మిన్స్ తో పాటు నామినీలుగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్ ఉన్నారు. 2023 లో ఆసీస్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, వన్డే వరల్డ్ కప్ అందించిన కమ్మిన్స్ కే ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు పై కమ్మిన్స్ స్పందిస్తూ.. నేడు (జనవరి 29) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అప్‌లోడ్ చేశాడు.

ఈ వీడియో లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, రన్  మెషీన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, జడేజా అత్యంత నిలకడైన ఆటగాళ్ళని.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వారు అద్భుతంగా ఆడతారని కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ, జడేజా ఆట మీద ఎల్లపుడూ అంకిత భావం కలిగి ఉంటారని.. ఆట నుంచి వారిని వేరు చేయలేరని ప్రశంసలు కురిపించాడు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లతో ఆడటం గర్వంగా భావిస్తున్నాని ఆసీస్ కెప్టెన్ తెలిపారు.          

2023 వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో కోహ్లీని 2023 వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. మరోవైపు జడేజా గత ఏడాది 35.12 సగటుతో 281 పరుగులు చేసి.. 33 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ క్రికెటర్ హెడ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసి ఆసీస్ కు టైటిల్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.