నిమ్స్​ బిల్డింగ్​పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

నిమ్స్​ బిల్డింగ్​పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

  పంజాగుట్ట, వెలుగు: అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి  ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం హైదరాబాద్​లోని పంజాగుట్టలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వై.లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎ.అచ్చయ్య (55) డిసెంబరు16న చికిత్స కోసం నిమ్స్​లోని సర్జికల్ ​గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో  చేరాడు.  ఆయనకు వైద్యులు 19న సర్జరీ చేశారు. 4 రోజుల తర్వాత స్పెషాలిటీ బ్లాక్​లోని ఇన్ పేషెంట్ వార్డుకు షిప్ట్​ చేశారు. ఈ క్రమంలోనే అచ్చయ్య శనివారం రాత్రి భోజనం చేశాక నిద్రపోయాడు.

ఆయన పక్కనే కుర్చీలో కుమారుడు గుర్నాథం నిద్ర పోయాడు. తెల్లవారుజామున 3.15 గంటలకు గుర్నాథంకు మెలుకువ రాగా, బెడ్​పై తండ్రి కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. అదే సమయంలో ఆస్పత్రి కింద పెద్ద శబ్దం వచ్చి అరుపులు వినబడటంతో అక్కడికి వెళ్లి చూడగా అచ్చయ్య కింద పడి కనిపించాడు. డాక్టర్లు వెంటనే ఆయనకు ట్రీట్‌మెంట్‌ అందించినా ఫలితం లేకుండా పోయింది. కడుపునొప్పితో మానసిక ఒత్తిడికి లోనైన అచ్చయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.