అమరావతి: ‘‘మా ఇల్లు ఉన్న తెలంగాణకు నేను వెళ్లకూడదా’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలదీశారు. అమరావతిలో మాట్లాడిన సందర్భంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జనసేన నేతలు పోరుపెడితే అక్కడికి వెళ్లానని.. పుష్కర కాలం తర్వాత కూడా అంత ద్వేషం ఊహించలేదని జనసేన అధినేత వాపోయారు. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదని, తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని పవన్ స్పష్టం చేశారు. దేశంలో బతకడం మన హక్కు అని, కాలరాసే హక్కు ఎవరికీ లేదని చెప్పుకొచ్చారు.
2014 నుంచి 2024 వరకు ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీకి రాలేదని పవన్ ప్రశ్నించారు. కేటీఆర్ తనకు సోదరుడు లాంటివారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదని.. జన సేనలోని తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారని -పవన్ కల్యాణ్ చెప్పారు.
విభజించుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తామని, భూమికి సరిహద్దులు ఉంటాయని, మనసుకు ఉండవని పవన్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, తమిళనాడు వెళ్తే ఎక్కడా ఇబ్బందులు లేవని.. ఇదంతా సీఎం రేవంత్‌కు తెలిసి జరిగిందని అనుకోవడంలేదని పవన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాహుల్, ప్రియాంక వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా’’ అని పవన్ నిలదీశారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని హితవు పలికారు.
