
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’ (ఓజస్ గంభీర). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ ఇవాళ (సెప్టెంబర్ 25న) థియేటర్లలో విడుదలైంది. ఓజాస్ గంభీర అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో పవన్ కళ్యాణ్ నటించాడు. ఒమీ అనే విలన్ క్యారెక్టర్లో ఇమ్రాన్ హష్మీ కనిపించాడు. పవన్ భార్యగా కన్మణి పాత్రలో ప్రియాంక, సత్య దాదాగా ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
సుమారు రూ.250 కోట్లతో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మోస్ట్ క్రియేటెడ్ టెక్నీషియన్స్ రవి కె.చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్స్గా పనిచేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఓజీ’ ఎలా ఉంది? ఫ్యాన్ బాయ్ సుజీత్ ఎలాంటి కథతో వచ్చాడు? పవన్ కళ్యాణ్కి హిట్ పడిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం
కథేంటంటే:
1970 జపాన్లో సమురాయ్ వంశాల కథతో మొదలవుతుంది. కొంతమంది భారతీయులు అక్కడి దేశస్తుల నుంచి తప్పించుకొని ముంబైకి వస్తారు. అలా వచ్చిన వాడే సత్య దాదా (ప్రకాష్ రాజ్). ఆయనతో పాటు ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) కూడా ముంబై వస్తాడు. సత్యా దాదా చుట్టూ ఒక కోటలా, రక్షణలా నిలబడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ముంబై వదిలి వెళ్ళిపోతాడు గంభీరా.
ఈ క్రమంలో సత్యదాదా ముంబాయిలో పోర్ట్ కడతాడు. కానీ, సత్యదాదా కుటుంబానికి స్నేహితుడు మిరాజ్ కర్ (తేజ్ సప్రూ)తోపాటు అతని కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మి) వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. ఈ క్రమంలో జిమ్మి అనేవాడు సత్యదాదా రెండో కొడుకుని ఓ కారణంచేత చంపుతాడు. ఆ తర్వాత ఓమి (ఇమ్రాన్ హష్మీ) సైతం ఎంట్రీ ఇచ్చి సత్యా దాదా మనుషులను చంపేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ముంబైకి రావాల్సి వస్తుంది ఓజాస్ గంభీరా. అప్పుడు ఏం జరిగింది?
ఓమీ ముంబై రావడానికి అసలు కారణం ఏంటీ? సత్యాదాదా కొడుకులకు ఏమైంది? మధ్యలో ఈ కన్మణి (ప్రియాంక మోహన్) ఎవరు? ఆమె గంభీర జీవితంలోకి ఎలా వచ్చింది? అర్జున్ దాస్, శ్రియా రెడ్డి పాత్రలు వెనుక స్టోరీ ఏంటీ? ఓజీకీ జపాన్‌లోని సమురాయ్ వంశానికీ సంబంధం ఏంటీ? చివరికి ఓమీతో ఓజీ ఎలాంటి యుద్ధం చేశాడనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే:
మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ వంటి జోనర్ బేస్ చేసుకుని టాలీవుడ్లో చాలా సినిమాలే వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి జోనర్ సినిమాలో బలమైన కథ ముఖ్యం. అందులో యాక్షన్ ఎంత ఉంటుందో.. డ్రామా, ఎమోషన్స్ కూడా సమపాళ్లలో ఇమిడి ఉండాలి. అప్పుడే ఈ జోనర్ సినిమాలు సినీ ఆడియన్స్కి నచ్చే అవకాశం ఉంది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. అయితే, ఓజీలో కథ ఉన్నప్పటికీ.. హీరో ఎలివేషన్స్ ఎక్కువ అవ్వడంతో కనుమరుగవుతుంది. కానీ, స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఆ లోటుని తీర్చేశాడు డైరెక్టర్ సుజీత్.
ALSO READ : ‘ఓజీ’ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా ఎన్ని కోట్లు?
ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే.. ‘ఓజీ’ కథలో కొంచెం ‘కేజీఎఫ్’ కనిపించగా.. ఇంకొంచెం రజినీ అల్టిమేట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ‘బాషా’ మూవీలా అనిపిస్తుంది. అనామకుడిలా ఒక సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే హీరో.. అందరినీ గడగడలాడించే స్థాయికి ఎదగడం.. అనుకోని పరిస్థితుల్లో ఆ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్లి.. కొంత కాలానికి తిరిగి రావడం.. మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటడం.. ఈ కోవలో వచ్చినదే ‘ఓజీ’. ఈ కథకు స్టైల్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సుజీత్.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, హీరోయిజం ఎక్కువ ఎలివేట్ అయ్యేలా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. అందుకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ సపోర్ట్ సుజీత్కి బాగా హెల్ప్ అయింది. విజిల్స్ కొట్టించేలా పనితనం చూపించి సత్తా చాటుకున్నారు. అయితే, అదే స్థాయిలో సినిమాలో ట్విస్టులు, ఎమోషన్స్ ఉండి ఉంటే, ఓజీ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉండేదని సదరు సినిమా అభిమానికి అనిపిస్తుంది.
సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. జపాన్ కథతో మొదలై ముంబై వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే పాత్రల పరిచయాలు, వారికిచ్చిన ఎలివేషన్స్ మెప్పిస్తాయి. అయితే, అనుకోని ఘటనల వల్ల ఆశ్రయమిచ్చిన సత్యదాదాని గంభీర వీడి వెళ్లడం, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురుచూపులతోనే ఫస్టాఫ్ సాగిపోతుంది. అయితే, గంభీర వచ్చాక మాత్రం ఇంటర్వల్ బ్యాంగ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా డిజైన్ చేశాడు సుజీత్. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ మధ్య మరింత బలమైన బంధం ఉంటే ప్రేక్షకుల మనసుని తాకేలా ఉండేదని అనిపిస్తుంది. కన్మణి క్యారెక్టర్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉండి ఉంటే బాగుండు.
సెకండాఫ్ విషయానికి వస్తే.. అవసరంలేని పాత్రలు, అవసరానికి మించిన ఎలివేషన్స్, అక్కర్లేని సబ్‌ప్లాట్‌లతో సాగిపోతుంది. పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్కు నిదర్శనంలా డిజైన్ చేశాడు సుజీత్. ఇక్కడ దర్శకుడిగా సుజీత్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఇదే టెంపోను సుజీత్ తర్వాత కూడా కొనసాగించి ఉంటే ‘ఓజీ’ స్థాయి వేరుగా ఉండేది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు హీరో- విలన్ మధ్య వచ్చే సీన్స్, ఎత్తులు, పై ఎత్తులు ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులో మంచి టేకింగ్ కనిపిస్తుంది. అయితే, ఫస్టాఫ్ ఇచ్చిన కిక్.. సెకండాఫ్ ఇవ్వలేకపోయింది. ఇచ్చి ఉంటే థియేటర్లు బద్దలయ్యేలా ఉండేది. ఓవరాల్గా ఓజీ ఒక పవన్ ప్రభంజనం.. తమన్ తాండవం.. ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే సంభవం!!
ఎవరెలా నటించారంటే:
పవన్ కళ్యాణ్ ప్యూర్ వన్ మ్యాన్ షో ఓజీ. ఆ గ్యాంగ్ స్టార్ లుక్, స్వాగ్, మేనరిజంతో పవన్ ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్ భాషలో చెప్పాలంటే.. ఓజీ ఫుల్ మీల్స్ కాదు, అంతకుమించి అనేలా పవన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఓజస్ గంభీరగా యాక్షన్ పార్ట్లో దుమ్మురేపాడు. కళ్లు, యాక్షన్ సీన్స్, యాక్టింగ్‌తో పవర్ ప్యాక్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, తెలుగు ఎంట్రీ అదిరింది. ఓమీ క్యారెక్టర్లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఓజీకి తగ్గట్టుగా ఓమీ బలమైన ఇంపాక్ట్ చూపించాడు. హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్ర పరిధి మేర ఆకట్టుకుంటుంది. మిగతా క్యారెక్టర్స్ తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు.
టెక్నీకల్ అంశాలు:
ఓజీ మూవీకి టెక్నీకల్ అంశాలు సినిమా స్థాయిని పెంచాయి. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాలు ఓజీ సినిమాకి బలాన్ని అందించాయి. ఈ విభాగాల పనితీరే ఓజీ క్వాలిటీ, ఎలివేషన్ విషయాల్లో ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. తనదైన మ్యూజిక్ టోన్తో, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో గూస్బంప్స్ కలిగేలా చేశాడు. ఆ తర్వాత ఇండియాస్ టాక్ క్రియేటివ్ టెక్నీషియన్స్ అయిన రవి కె.చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక మూడో విభాగం ఎడిటింగ్.. ఓజీ విషయంలో కీలక రోల్ ప్లే చేసింది. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ తన కత్తెరతో సినిమాకి అర్ధం తీసుకొచ్చాడు.
ఇక చివరగా.. సినిమా కర్త, కర్మ, క్రియ.. డైరెక్టర్ సుజిత్.. ఫ్యాన్ భాయ్ అనిపించుకున్నారు. తన అభిమానం హీరో పవన్ కళ్యాణ్ని సరికొత్త అవతారంలో చూపించి విజిల్స్ పడేలా డిజైన్ చేశాడు. పవర్ స్టార్ కనిపించిన ప్రతి సీన్లో ఓ మార్క్ ఎలివేషన్ చూపించి మెప్పించాడు. అయితే, కథనంలో మరియు హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ఎమోషన్ పార్ట్లో ఇంకాస్తా బలాన్ని తీసుకురావాల్సి ఉంది. ఓవరాల్గా డైరెక్టర్ సుజిత్ స్టైలిష్ మేకింగ్ సినిమాని ఫ్యాన్స్కి అందించి సక్సెస్ అయ్యాడు.