వెల్లంపల్లి వెల్లుల్లి.. వైసీపీ నేతలపై పవన్ సెటైర్లు

వెల్లంపల్లి వెల్లుల్లి.. వైసీపీ నేతలపై పవన్ సెటైర్లు

రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిలో జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ ..అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవని వాటిలో తప్పొప్పులు ఉంటే సరిచేసుకుని ముందుకెళ్లాలన్నారు. వెల్లంపల్లి వెల్లుల్లి పాయకు బంతి చామంతి నేతలంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు పవన్.  ఒక్క ఛాన్సిస్తే ఏపీని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తాం..ఇంకో ఛాన్సిస్తే స్కూల్ పిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం అన్నట్లుగా వైసీపీ నేతల ప్రతిజ్ఞలు ఉన్నాయని చురకలంటించారు.  

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా శంకుస్థాపనలతో పని మొదలు పెడతే.. వైసీపీ మాత్రం కూల్చివేతలతో ప్రారంభించిందన్నారు. మూడు రాజధానులు అని ఇప్పుడు చెబుతున్న నేతలు ఆనాడు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని.. రాజధాని ఇక్కడి నుంచి కదలదన్నారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించే అర్హత వైసీపీ నేతలకు ఎక్కడుందన్న పవన్.. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందన్నారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని కూడా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.