పనిచేయడమే తప్ప ప్రచారం తెలియదు : పవన్ కళ్యాణ్

పనిచేయడమే తప్ప ప్రచారం తెలియదు : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘హరిహర వీరమల్లు’.  జ్యోతి కృష్ణ దర్శకత్వంలో  ఏఎం రత్నం నిర్మించిన ఈ మూవీ జులై 24న విడుదల కానుంది.  సోమవారం హైదరాబాద్‌‌లో  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏఎం రత్నం గారి కోసం ఇప్పుడు మాట్లాడుతున్నా. రెండు కరోనాలతో సహా ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఏం చేసినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా సినిమా బాగా రావాలనే తపన ఏఎం రత్నం గారిలో చూశా.  

నేను రాజకీయాల్లో ఉన్నా ఈ సినిమాకోసం నా బెస్ట్ ఇచ్చాను. ఒక్క క్లైమాక్స్‌‌కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. నేను ఎప్పుడో దేశ విదేశాల్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు ఈ సినిమాకి పనికొచ్చాయి.  కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్‌‌ల దగ్గరకు ఎలా వచ్చింది అనేది కథ. క్రిష్ గారు కొన్ని కారణాల వల్ల పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఒకానొక దశలో సినిమా ఆగిపోయిందని ప్రచారం జరగగా, నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్ వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఈ సినిమాని నా భుజాలపైకి తీసుకున్నాను.  ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. 

సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. ఈ సినిమా అనాథ కాదు.. నేనున్నాను అని చెప్పడానికే ఈ రోజు వచ్చాను. కీరవాణి గారి సంగీతం ఈ చిత్రానికి ప్రాణవాయువు.  ఈ మూవీ  అవుట్‌‌పుట్ అద్భుతంగా వచ్చింది. థియేటర్‌‌‌‌కి వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఓ మంచి అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నా’ అని  అన్నారు. ఈ చిత్రం తన కెరీర్‌‌‌‌లో స్పెషల్‌‌గా నిలుస్తుందని నిధి అగర్వాల్ చెప్పింది. దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ‘17వ శతాబ్దం మొఘల్స్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. 

ఆ సమయంలో ఔరంగజేబుకి, వీరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధం లాంటిది ఈ సినిమా. పవన్ గారిలో  ఉన్న ఫైర్‌‌‌‌లో నుంచి డిజైన్ చేసిందే 'ధర్మం కోసం యుద్ధం'. ఆయన్ను  తెరమీద ఎలా చూడాలని ఎదురుచూస్తున్నామో.. ఆ కోరిక ఈ  చిత్రంతో  నెరవేరనుంది’ అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ మర్చిపోలేనిది అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు.