ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురికి పవన్ కల్యాణ్

ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురికి పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కొండగట్టు, ధర్మపురిలను దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ సన్నిధిలోనే ఎన్నికల ప్రచార వాహనం వారాహికి సంప్రదాయ పూజలు జరపాలని నిర్ణయించారు. 2009లో ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఆ ప్రాంతానికి వెళ్లినపుడు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని పవన్ కల్యాణ్ విశ్వసిస్తారని సమాచారం. అందుకే ఆయన తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక రాజకీయ పర్యటనల కోసం రూపొందించిన వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర ( 32 నారసింహ క్షేత్రాల దర్శనం)ను ప్రారంభించాలని పవన్ కల్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు చేసి, మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను దర్శించనున్నట్టు సమాచారం.