Pawan Kalyan : ఉప్పొంగుతున్న పవనిజం.. USలో 'OG' అడ్వాన్స్ సేల్స్‌ రికార్డ్స్!

Pawan Kalyan : ఉప్పొంగుతున్న పవనిజం.. USలో 'OG' అడ్వాన్స్ సేల్స్‌ రికార్డ్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ' ఓజీ' (They Call Him OG) . ఈ మూవీ విడుదల కాకముందే సంచలనం సృష్టిస్తోంది. రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అభిమానుల్లో ఇప్పటి నుంచే పండుగ వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్స్‌కి సిద్ధమవుతున్న ఈ చిత్రం.. అడ్వాన్స్ ప్రీ-సేల్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. కేవలం కొద్ది గంటల్లోనే దాదాపు 9 లక్షల డాలర్ల మార్కును అధిగమించింది. అత్యంత వేగవంతమైన  ఈ ఘనత సాధించిన భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది.

ఫుల్ జోష్ లో అభిమానులు.. 
లేటెస్ట్ గా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిర సినిమాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ఓజీ’ ప్రీమియర్ ప్రీ-సేల్స్ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఊహించని రికార్డులు నింపింది. మొత్తం ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ ప్రీ-సేల్స్ 9 లక్షల  డాలర్లకి పైగా చేరింది. 400లకు పైగా లొకేషన్స్‌లో మొత్తం 32 వేలకు పైగా  టికెట్లు అమ్ముడుపోయాయని వెల్లడించింది. ఈ అద్భుతమైన స్పందన చూసి పలు థియేటర్ సర్క్యూట్‌లు అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నాయి.  ఈ సంఖ్య మరింత పెరుగుతోందని తెలిపింది. 

 

 ప్రీమియర్ ప్రీ-సేల్స్ లో  ‘ఓజీ’ రికార్డులు
గతంలో పాన్ -ఇండియా స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఇంత వేగంగా 9 లక్షల డాలర్ల మార్కును చేరుకోలేదు. కానీ 'ఓజీ' మూవీ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.  ఇది పవన్ కళ్యాణ్ పై ఉన్న క్రేజ్ ను మరోసారి చాటి చెప్పిందని సినీ విశ్లేషకులు అంటున్నారు . సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్‌గా నటించడం కూడా అంచనాలను మరింత పెంచింది. హష్మీ తన పవర్ ఫుల్ పాత్రతో దక్షిణాది ప్రేక్షకులను అలరించనుండడంతో..ఈ చిత్రం నిజమైన పాన్-ఇండియన్ స్పెషల్ మూవీగా నిలిచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..

 

టార్గెట్ 2మిలియన్ డాలర్లు.. 
ప్రీమియర్ షోకు ఇంకా 22 రోజులు మిగిలి ఉండటంతో.. 'ఓజీ' అడ్వాన్స్ సేల్స్ సునాయాసంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే.. ఓవర్సీస్‌లో అత్యధిక ప్రీమియర్స్ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా 'ఓజీ' నిలుస్తుందంటున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్ పంపిణీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.  ఈ అద్భుత రెస్పాన్స్ సినిమాపై ఉన్న అంచనాలను, పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను స్పష్టం చేస్తోందని సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి 

పవన్ కళ్యాణ్ సరసన ఈ మూవీలో ప్రియాంక మోహన్ నటించింది. ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, షాన్ కక్కర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. డీవీవీ దానయ్య  నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు గట్టి నమ్మకంగా ఉన్నారు.  మరి సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.