
కార్యకలాపాలు మొదలుపెట్టిన రెండో ఏడాదిలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లాభాల బాట పట్టింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 19 కోట్ల లాభం ఆర్జించింది. మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీ) 19 శాతం వాటా దక్కించుకుంది. ఇండియాలోని మొత్తం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలలో దాదాపు మూడో వంతు లావాదేవీలు తమ ప్లాట్‌ఫామ్ ద్వారా జరుగుతున్నాయని పీపీబీ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన ఆ లావాదేవీల విలువ సుమారు రూ. 3 లక్షల కోట్ల దాకా ఉందని పేర్కొంది. మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ. 21 కోట్ల నష్టం వచ్చింది. ఆగస్టు 2016 లో ఏర్పాటైన ఈ కంపెనీ 2017 లో కార్యకలాపాలు మొదలు పెట్టింది. గత ఏడాది అద్భుతమైన పనితీరు చూపించినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. దేశంలో లాభాలు ప్రకటించిన మొదటి పేమెంట్ బ్యాంక్ కావడం గర్వంగా ఉందని చెప్పారు. ఏప్రిల్ 2019 నాటికి సేవింగ్స్ అకౌంట్లలోని డిపాజిట్లు రూ. 500 కోట్లకు మించినట్లు పేర్కొన్నారు. డిపాజిట్ల ప్రకారం చూస్తే దేశంలోనే పెద్ద పేమెంట్స్ బ్యాంక్ తమదేనని తెలిపారు. ఈ ఏడాది సేవింగ్స్ అకౌంట్లలో పేమెంట్స్‌ను నెలకు రూ. 40 వేల కోట్లకు పెంచాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా వన్97 కమ్యూనికేషన్స్ చేతిలో ఉంది.