
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్) ఎండీ, సీఈఓ పదవుల నుంచి సురీందర్ చావ్లా తప్పుకున్నారని పేరెంట్కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. ఆయన రాజీనామా ఈ ఏడాది జూన్ 26 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది జనవరి 9న చావ్లా పీపీబీఎల్‌లో చేరారు. ఆయన సోమవారం సాయంత్రం రాజీనామా ఇచ్చారని, వ్యక్తిగత విషయాలే ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ శేఖర్ శర్మ కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఇబ్బంది పడిన కంపెనీ తన బోర్డులో మార్పులు చేసింది.
మాజీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ల నియామకంతో బ్యాంక్ తన బోర్డు ఆఫ్ డైరెక్టర్లను పునర్నిర్మించింది. అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ రజనీ సేఖ్రీ సిబల్ ఇటీవల ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా చేరారని పేటీఎం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.