పేటీఎం షేర్లు ఢమాల్.. 2 రోజుల్లో 40 శాతం డౌన్

పేటీఎం షేర్లు ఢమాల్.. 2 రోజుల్లో 40 శాతం డౌన్

పేటీఎం షేర్లు కొనుగోలు చేసినోళ్లు లబోదిబో అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో పేటీఎం షేర్లు భారీగా పడిపోయాయి. పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై ఆంక్షలు విధించటం, ఫిబ్రవరి 29వ తేదీలోపు పేటీఎం బ్యాంక్ లావాదేవీలు మూసివేయాలన్న ఆదేశాలతో పేటీఎం షేర్ల ధర పడిపోయింది. 2 రోజుల్లోనే 40 శాతం పడిపోయి.. 487 రూపాయల దగ్గర డ్రేట్ అవుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఒక్క రోజే పేటీఎం షేరు 121 రూపాయలు తగ్గింది. ఇది 20 శాతంగా ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ కూడా 20 శాతం పడిపోయింది. జనవరి 31వ తేదీ 761 రూపాయలుగా ఉన్న ఒక్కో షేరు ధర.. ఫిబ్రవరి 2వ తేదీన 487 రూపాయలకు చేరింది. రెండు రోజుల్లో ఒక్కో షేరు 273 రూపాయలు తగ్గింది. 

పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలతో కంపెనీకి 500 కోట్ల రూపాయల వరకు నష్టం అని పేటీఎం కంపెనీనే ప్రకటించింది. ఓ వైపు ఆంక్షలు.. మరో వైపు కంపెనీ లాభాలు భారీగా తగ్గిపోతున్నాయన్న వార్తలతో.. ఇన్వెస్టర్లు తమ షేర్లను తెగబడి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే భారీగా పతనం అవుతుంది పేటీఎం షేరు ధర. ఇదే సమయంలో పేటీఎం షేర్లలో లావాదేవీలు కూడా జరగటం లేదు. అమ్మే వాళ్లే ఉన్నారు.. కొనేవారు లేరు. షేరు వ్యాల్యూ ఎంత వరకు తగ్గుతుంది.. ఎక్కడ స్టేబుల్ అవుతుంది అనే విషయాలపై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు పెట్టుబడిదారులు. 

2021, నవంబర్ నెలలో 17 వందల రూపాయలు ఉన్న పేటీఎం షేరు ధర.. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. 2022లో ఐదు నుంచి ఆరు వందల దగ్గర ట్రేడ్ అయిన పేటీఎం షేరు.. ఏడాది కాలంగా క్రమంగా పుంజుకుంటూ 950 రూపాయల వరకు వచ్చింది. 2023 డిసెంబర్ నెలలో మళ్లీ 600 రూపాయలకు పడిపోయిన షేరు ధర.. 2024 డిసెంబర్ నెలలో మళ్లీ పుంజుకుని 760 రూపాయల వరకు చేరింది. ఇదే టైంలో పేమెంట్ బ్యాంక్ సేవలపై ఆంక్షలతో.. 2 రోజుల్లోనే 40 శాతం తగ్గి.. 273 రూపాయలు నష్టపోయింది. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 487 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. రాబోయే రోజుల్లో మరింత పడే అవకాశాలు కూడా లేకపోలేదు..