
ఆన్లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎంకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇటీవల పేటీఎం పేమేంట్స్ బ్యాంక్స్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించగా.. తాజాగా పేటీఎంకు సంబంధించిన రూ. 50 కోట్ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పేటీఎం మాతృ సంస్థ One 97కమ్యూనికేషన్స్ చైనా యాజమాన్యంతో లింకప్ అయి ఉందని పేటీఎం పెట్టుబడులను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.
Paytm తన కొత్తగా ఏర్పాటు చేసిన చెల్లింపుల గేట్ వే విభాగంలో ఇప్పటికే చేసిన పెట్టుబడి కోసం గతేడాది 2023లో ప్రభుత్వ అనుమతిని కోరింది. ఆన్ లైన్ చెల్లింపులను ఆమోదించడానికి అవసరమైన చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ పొందేందుకు paytm చెల్లింపు సేవలకు ఈ ఆమోదం తప్పనిసరి.
చైనాకు చెందిన యాంటిఫిన్ (నెదర్లాండ్స్ )హోల్డింగ్స్ Paytm లో 9.88 శాతం వాటాను కలిగి ఉంది. విదేశీ పెట్టుబడులను కలిగి ఉన్న సంస్థకు కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, పరిశ్రమల శాఖ ఆమోదం తప్పనిసరి.
2024 జనవరిలో పేటీఎం అనుమతులను కేంద్ర హోంశాఖ ఆమోదించగా.. విదేశీ వ్యవహారాల శాఖ తిరస్కరించింది. ఫలితంగా పేటీఎం పెట్టుబడులకు ఆమోదం లభించలేదు. పేటీఎం కంపెనీ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆమోదం కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరినందున పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.
అయితే పెట్టుబడులకు అనుమతి వాయిదా, పెనాల్టీకి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని Paytm తెలిపింది.