
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీని ‘‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’’ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్.. మీ నాన్నకు రాజకీయ జన్మనిచ్చిందే కాంగ్రెస్ అని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేననే విషయాన్ని మరవరాదని సూచించారు. అవినీతి విషయానికి వస్తే.. బీఆర్ఎస్ అంటేనే “భ్రష్టాచార్ రక్షణ సమితి” అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినన్ని స్కామ్ లు ఎప్పుడు జరగలేదని ఆరోపించారు.
కేసీఆర్.. ఆయన కుటుంబం ప్రతీ కుంభకోణంలో ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్, హరీశ్ పాల్పడ్డారని, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్, లిక్కర్ కేసులో కవిత, సాండ్ మాఫియాలో సంతోష్.. ఉన్నారని ఆరోపించారు. ఇన్ని స్కామ్ లలో ఉండి.. కేటీఆర్ కాంగ్రెస్ ను కరప్షన్ పార్టీ అనడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు పీసీసీ చీఫ్ లేఖ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంకు.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం లేఖ రాశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎంత నరకాన్ని అనుభవించారో మీరు ప్రత్యక్షంగా చూశారని, ఇలాంటి సందర్భంలో జూబ్లిహిల్స్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్‌ను ఓడించేందుకు మీ వంతు సహకారాన్ని కోరుతున్నామని ఆ లేఖలో మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజా పాలనకు మీ మద్దతు అవసరమని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.