
- కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ జయంతి కార్యక్రమానికిడిప్యూటీ సీఎం, మంత్రులు హాజరు
హైదరాబాద్, వెలుగు: దేశానికి, తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి పుంజల శివశంకర్ విశిష్ట సేవలు అందించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో శివ శంకర్ 96వ జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, అనిల్ ఈరవర్తి, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. శివశంకర్ రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాసేవకు అంకితమైందని పేర్కొన్నారు. నిష్కలంక, నిబద్ధత, కష్టపడి పనిచేసే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టిందన్నారు. ప్రజల హక్కుల కోసం, అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్థాయిగా గుర్తుండిపోతుందని తెలిపారు.
రాజకీయ నాయకులకు స్ఫూర్తి..: మంత్రి పొన్నం
కేంద్ర మంత్రిగా, న్యాయ కోవిదుడుగా శివ శంకర్ నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితంగా క్రియాశీల నిర్ణయాల్లో అండగా ఉన్నారని గుర్తుచేశారు. దేశ రాజకీయాల్లో చాలా ప్రభావితం చేశారని, విద్య ఉంటేనే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని నిరూపించిన వ్యక్తి అని కొనియాడారు.
మన పిల్లలని మంచిగా చదివించి పోటీ ప్రపంచంలో తీర్చిదిద్దేందుకు శివశంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బలహీన వర్గాలకు ఐకాన్‌గా ఉన్న శివ శంకర్ విగ్రహాన్ని పెట్టే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, విగ్రహ ఏర్పాటుకు ఆయన అంగీకరించారని తెలిపారు. విగ్రహాల ఏర్పాటు వల్ల రాబోయే తరానికి వారి చరిత్ర తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.