బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం : పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం : పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్
  •  
  • త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తం: పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్​
  • రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్​ కట్టుబడి ఉన్నది
  • బీజేపీ ఎన్నిరోజులు అడ్డుపడ్డా..  బీసీల కల సాకారం చేస్తామని వెల్లడి 
  • 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాల్సిందే: జాజుల శ్రీనివాస్​ గౌడ్​
  • ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘బీసీల మహాధర్నా’ 

న్యూఢిల్లీ, వెలుగు:   విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకోసం కేంద్రంపై పోరాడుతామని పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌‌‌గౌడ్​ తెలిపారు. ఇందుకోసం త్వరలోనే తమ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా  గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామే తప్పా.. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియనుంచి కాంగ్రెస్  వైదొలగలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చర్చించామని చెప్పారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌ వద్ద ‘బీసీల మహాధర్నా’ నిర్వహించారు. ఈ ఆందోళనలో పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ కుమార్ గౌడ్, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు మల్లు రవి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రాపోలు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షుడు సచిన్ రాజోలుకర్, బీసీ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌‌గౌడ్​ మాట్లాడుతూ.. ‘‘బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్  కట్టుబడి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్‌‌లోనే బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నాం. అయితే కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లాం.  మంచి ఫలితాలు సాధిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. అయితే 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని 9వ షెడ్యూల్‌‌లో చేర్చకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు తొక్కి పెడుతున్నది. బీజేపీ ఎన్ని రోజులు అడ్డుపడ్డా.. బీసీల కల సాకారం కావడానికి ఎంతో దూరం లేదు” అని వ్యాఖ్యానించారు.  

బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుంది

బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ అడుగడుగునా అడ్డుపడుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు.  రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకొని బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందని అన్నారు. బీసీ బిల్లుపై పార్లమెంట్‌‌లో  కొట్లాడుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందించకపోవడం దారుణమని ఎంపీ మల్లు రవి అన్నారు.  బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి బీసీలపై ప్రధాని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తే నాన్చుడేంది?: జాజుల

42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ అసెంబ్లీ ఏక గ్రీవంగా ఆమోదించిన బిల్లులను నాన్చుడేందని కేంద్రంపై  జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫైర్​ అయ్యారు. బీసీలను అణచివేయాలని చూస్తే  దేశంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అలాగే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసి.. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్​ చేశారు.  బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉధృతం చేస్తున్నామన్నారు. అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పందించకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.  పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇప్పటిఏ రెండుసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టినా..  రిజర్వేషన్ల అంశంపై అఖిలపక్షంతో కలిసి ఎందుకు ప్రధానిని కలవడం లేదని ప్రశ్నించారు.