
నిర్మల్, వెలుగు: రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శకునిలా తయారయ్యారని పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని బిల్లులను రూపొందించి పంపిస్తే.. కేంద్రం ఆమోదించకుండా కిషన్‌రెడ్డి మోకాలడ్డుతున్నారని అన్నారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టునూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీలను ఎదిరించి బీజేపీ నాయకులు తిరిగి చట్టసభల్లో అడుగుపెట్టగలరా? అని ప్రశ్నించారు. ఆదివారం నిర్మల్‌జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన జనహిత పాదయాత్రలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు.
తెలంగాణ సర్కారు పంపిన బీసీ బిల్లులపై ప్రధాని మోదీ ముఖం చాటేశారని, అమిత్‌షా ఇంట్లో దాక్కున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 100 సీట్లు గెలిచి సోనియాకు కానుకగా ఇస్తామన్నారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్లతోపాటు అభివృద్ధి కార్యక్రమాల అమల్లోరాష్ట్రం దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తున్నదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు.
దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, మక్కాన్ సింగ్, నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.