మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కేసీఆర్ అవినీతే కారణం .. విజిలెన్స్ దర్యాప్తు జరగాలి: పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కేసీఆర్ అవినీతే కారణం .. విజిలెన్స్ దర్యాప్తు జరగాలి: పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి
  • అవినీతి, నాణ్యతా లోపం వల్లే ప్రమాదం   
  • తమతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు మేడిగడ్డకు రావాలని సవాల్ 
  • కాళేశ్వరం రాష్ట్రానికి ఒక గుదిబండ: భట్టి విక్రమార్క 

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు అవినీతిలో మొదటి దోషి కల్వకుంట్ల ఫ్యామిలీనే అని, నాణ్యతా లోపం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత మీడియాతో రేవంత్ మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతం అని గొప్పలు చెప్పారు. రైతులు, ప్రజల్ని బస్సుల్లో తీసుకెళ్లి మరీ ఆ ప్రాజెక్టును చూపించారు. పంప్ హౌజ్ లు మునిగినప్పుడు మాత్రం ప్రతిపక్ష నేతలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు వరదలు కూడా లేకుండానే బ్రిడ్జి కుంగింది.

ఈ ప్రాజెక్టు పేరిట లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారు” అని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బ్యారేజీ కుంగడం వెనక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా, లేక మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా అన్న దానిపై పూర్తి స్థాయి విచారణకు కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ఆదేశించాలన్నారు. కాళేశ్వరం పనులపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. మేడిగడ్డకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని రేవంత్ తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు తమతో కలిసి మేడిగడ్డకు రావాలని ఆయన సవాల్ విసిరారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి కూడా అక్కడ పర్యటించాలని కోరారు. బ్యారేజీని ప్రైవేట్ సంస్థలు నిర్మించాయని, తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణకు ఎందుకు ఆదేశించడంలేదని ప్రశ్నించారు.  

సెక్యులర్ ప్రభుత్వాలు రావాలె 

రాష్ట్రంలో త్వరలో ప్రభుత్వం మారుతుందని రేవంత్ అన్నారు. ఆదివారం మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ తో కలిసి ఆయన ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాకు చాదర్ సమర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని దర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా అందరికీ సంక్షేమం, అభివృద్ధి అందాలని కోరుకున్నట్లు వెల్లడించారు.    

జనం సొమ్మును గోదారిలో పోసిన్రు


కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట సీఎం కేసీఆర్ తెలంగాణ సొమ్మును గోదారిలో పోశారని సీఎల్పీ నేత భట్టి విమర్శించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారబోతోందన్నారు. సాంకేతిక నిపుణులు, సలహాదారులు లేకుండానే కేసీఆరే ప్లాన్ లు గీశారన్నారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని కేసీఆర్, కేటీఆర్ లు పదే పదే చెప్పుకున్నారన్నారు. మరి ఇప్పుడు నాణ్యతాలోపంతో మేడిగడ్డ బ్రిడ్జి కుంగిపోతే, ఈ డిజైన్ తానే రూపొందించానని ఎందుకు చెప్పుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గీసీన రీడిజైనింగ్ వల్లే కాశేళ్వరం నష్టదాయకంగా మారిందన్నారు. బ్యారేజీ కుంగడంపై తక్షణమే విచారణ కమిటీ వేసి, వాస్తవాలు ఏమిటో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.