అగ్నిపథ్​.. మోడీ అనాలోచిత చర్య

అగ్నిపథ్​.. మోడీ అనాలోచిత చర్య

హైదరాబాద్/ఘట్కేసర్/పద్మారావునగర్, వెలుగు: ఆర్మీలో చేరాల్సిన రాకేశ్‌‌ను చంపింది టీఆర్‌‌ఎస్‌‌ అయితే.. చంపించింది బీజేపీ అని పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి ఆరోపించారు. వరంగల్‌‌లో రాకేశ్‌‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు ఘట్కేసర్‌‌ టోల్‌‌గేట్‌‌ వద్ద అడ్డుకొని అరెస్ట్‌‌ చేశారు. అక్కడి నుంచి ఘట్కేసర్‌‌ ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్‌‌ రెడ్డి మాట్లాడుతూ.. రాకేశ్‌‌ భౌతిక కాయానికి నివాళులర్పించి, వాళ్ల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. టీఆర్‌‌ఎస్‌‌ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ జెండాలతో అంతిమయాత్ర చేయొచ్చు.. కానీ తాము కనీసం పరామర్శించే అవకాశం లేదా? అని నిలదీశారు. టీఆర్‌‌ఎస్‌‌ చావులను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్నారు. త్వరలోనే సిరిసిల్లలో నిరుద్యోగ, విద్యార్థి డిక్లరేషన్‌‌ ప్రకటిస్తామన్నారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకే వరంగల్​కు బయల్దేరానని, టీఆర్‌‌ఎస్‌‌లా రాజకీయాలు చేయడానికి కాదని విమర్శించారు. రేవంత్‌‌ అరెస్ట్‌‌ను నిరసిస్తూ ఘట్కేసర్‌‌ పీఎస్​ ఎదుట మాజీ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో కాంగ్రెస్‌‌ శ్రేణులు మెరుపు ధర్నా చేశాయి. 

అగ్నిపథ్​.. మోడీ అనాలోచిత చర్య

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య, మోడీ అవగాహన లోపంతో అగ్నిపథ్​ అనే కొత్త లోపభూయిష్టమైన స్కీం పుట్టుకొచ్చిందని, వెంటనే రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ ఉద్యమిస్తుందని ఆ పార్టీ స్టేట్ ​ప్రెసిడెంట్ ​రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి గాంధీ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న 13 మంది అగ్నిపథ్​ క్షతగాత్రులను పరామర్శించిన తరువాత మెయిన్​ గేటు వద్ద మాట్లాడారు. అగ్నిపథ్​ నిరసనల్లో పాల్గొన్న యువకులపై ఎలాంటి కేసులు పెట్టొద్దన్నారు. మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన యువకుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్​గ్రేషియా ఇచ్చి.. ఫ్యామిలీలో ఒకరికి జాబ్​ఇవ్వాలన్నారు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అగ్నిపథ్ క్షతగాత్రులను పరామర్శించేందుకు యత్నించిన కాంగ్రెస్​ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. మెయిన్​ గేట్​వద్దే ఆ పార్టీ నేతలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ ​కుమార్​ యాదవ్, యూత్ కాంగ్రెస్​ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్​ యాదవ్​ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. 

నాలుగేండ్ల తర్వాత ఏం జేయాలె..?​

అగ్నిపథ్‌‌లో భాగంగా సైన్యంలో చేరిన యువతకు నాలుగేండ్ల తర్వాత సంబంధం లేదంటే ఎట్లా అని, ఆ తరువాత వారు ఏం జేయాలె అని పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి ప్రశ్నించారు. శనివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు దేశానికి వెన్నెముక అయితే సైనికులు దేశానికి రక్షణ అని అన్నారు. ట్విట్టర్‌‌ పిట్ట ట్విట్టర్‌‌లో ఏదేదో వాగుతున్నారని మంత్రి కేటీఆర్​ను ఉద్దేశించి మండిపడ్డారు. కేంద్రం తక్షణమే అగ్నిపథ్‌‌ స్కీమ్​ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌‌ చేశారు.