తన మీద విమర్శలు చేసే నాయకులకు సిగ్గు , శరం ఉండాలన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోతిరెడ్డిపాడు మొదలు పెట్టినప్పుడు తాను మంత్రిని కాదు అని చెప్పారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203 పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRBM ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు విషయంలో జివో 203 పై బోర్డుకు తమ అభ్యంతరం తెలిపామన్నారు. తమ అభ్యంతరాలను కేంద్రానికి-కేంద్ర జలవనరుల శాఖకు పంపాలని చైర్మన్‌ను కోరామన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 44క్యూసెక్కుల కంటే ఎక్కువ డ్రా చేస్తున్న విషయాన్ని బోర్డ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
విభజన అంశాలతో సహ అన్ని అంశాలతో లిఖిత పూర్వకంగా బోర్డ్ కు తెలిపామన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఖకు బోర్డ్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని, బోర్డ్ సమర్థవంతంగా ఉండకపోతే ఏ రాష్ట్రం ఎంత నీరు డ్రా చేస్తోందో అంకెలు కూడా తెలియని పరిస్థితి ఉండేదన్నారు.
జనవరి నెలలోనే పోతిరెడ్డిపాడు విస్తరణ విషయంలో ఏపీ నిర్ణయం గురించి కేసీఆర్ కు గుర్తు చేశామని, ఆయన దృష్టికి వచ్చినా కేసీఆర్-జగన్ తో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఉత్తమ్. కేసీఆర్ – జగన్ రెండు సార్లు భేటీ అయినా పోతిరెడ్డిపాడు విషయం పై ఎందుకు చర్చించలేదని అన్నారు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కొరకు ఏపీ ప్రభుత్వం కర్నూలు అధికారులకు భూ సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు ఉత్తమ్. సాగునీరే కాకుండా తాగునీరు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్ తో తాము ఫోన్ లో మాట్లాడుతామన్నారు.
