ఇయ్యాల పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్

ఇయ్యాల  పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్
  • అటెండ్ కానున్న దీపాదాస్, సీఎం రేవంత్, భట్టి, ఏఐసీసీ సెక్రటరీలు

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ సెక్రటరీలు, సీఈసీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అటెండ్ కానున్నారు. ఎంపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత తొలిసారి ఈ మీటింగ్ జరుగుతోంది.

ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి, వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న సభకు సంబంధించి నేతలు ఈ మీటింగ్​లో చర్చించనున్నారు. ముఖ్యంగా గత 100 రోజుల ప్రజాపాలన, ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభ్యర్థులకు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ దిశా నిర్దేశం చేయనున్నారు. అంతకుముందు 3 గంటలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, కో చైర్మన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది.

ఈ మీటింగ్ కు దీపాదాస్ మున్షీ అటెండ్ అవుతున్నట్లు పార్టీ వెల్లడించింది. ప్రచార సరళిపై కమిటీ పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ గౌడ సంఘం నాయకుడు పల్లె లక్ష్మణ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత, పలువురు బీఆర్ఎస్  కార్పొరేటర్లు.. ఏఐసీసీ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.