
ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ ఎత్తున వసూళ్లు చేసి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వందల మంది నిరుద్యోగుల నుంచి వేలల్లో వసూలు చేసి మోసం చేయడంతో పీడీ కేసు నమోదు చేసి ఆదివారం (సెప్టెంబర్ 28) హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ కే డిజిటల్ మైక్రో పైనాన్స్ ఎండీ జవాడే క్రిష్ణ నిరుద్యోగులను తరచూ మోసం చేస్తుండటంపై పీడీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మూడు వందల మందికి పైగా నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కొక్కరి నుండి 20 వేల రూపాయల నుంచి భారీగా వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో నిందితుని పై 25 కేసులు నమోదు చేశారు పోలీసులు.
జవాడి కృష్ణను అరెస్టు చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో అరెస్టు చేశారు పోలీసులు. ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడకు చెందిన జవాడే కృష్ణ ఎస్‌కే మైక్రో ఫైనాన్స్ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి ఫైనాన్స్, ప్రభుత్వ హాస్పిటల్స్, అంగన్‌వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్‌లో ఆఫీసులు ఓపెన్ చేసి 300 మంది నుంచి సుమారు. రూ. 69 లక్షలు వసూలు చేశాడు.