
ఎల్బీనగర్, వెలుగు: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పై వనస్థలిపురంలో పీఎస్లో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసు (పీడీపీపీ యాక్ట్) నమోదైంది. వనస్థలిపురంలోని లైబ్రరీ గ్రౌండ్లో కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గురువారం శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరు కావాల్సి ఉంగా, అనివార్య కారణాలతో రాలేదు.
దీంతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర లైబ్రరీ పరిషత్ చైర్మన్ రియాజ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్ మధుసూదన్ హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి కూడా అటెండ్ అయ్యాడు. కార్యక్రమం జరిగిన తర్వాత ఎంపీ ఈటల పేరు శిలాఫలకంపై ఎందుకు పెట్టలేదని జిల్లా లైబ్రరీ సెక్రటరీతో గొడవకు దిగారు.
సిబ్బంది చెప్పే విషయం కూడా వినకుండా శిలాఫలాకన్ని సుత్తెతో ధ్వంసం చేశాడు. ధ్వంసం చేస్తున్న సమయంలో ఆయనతో పాటు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఈ ఘటనపై జిల్లా లైబ్రరీ సెక్రటరీ రాణి ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 324(4),351(2) పీడీపీపీ యాక్ట్ కింద ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.