హాస్టల్ వసతి లేక పెబ్బేరు పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్ల ఇబ్బందులు

హాస్టల్ వసతి లేక పెబ్బేరు పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్ల ఇబ్బందులు
  • బయట రూములు, హాస్టళ్లలో ఉండలేకపోతున్నామని ఆవేదన
  • నాలుగు రోజుల కింద పెబ్బేరు చౌరస్తాలో ఆందోళన
  • పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్‌ భవనం పూర్తయి ఐదేండ్లైనా ఓపెన్ చేయడం లేదు.  దీంతో  స్టూడెంట్లు ప్రైవేట్ హాస్టళ్లు, రూముల్లో ఉంటూ...  బస్సులు, ఆటోల్లో కాలేజీకు వెళ్తున్నారు. ప్రైవేటులో చదివే స్థోమత లేకనే తమ పేరెంట్స్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో చేర్పించారని, బయట హాస్టళ్లు, రూములకు రెంట్లు కట్టడం భారంగా మారిందని స్టూడెంట్లు వాపోతున్నారు. కాలేజీ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్, గ్రీనరీ పేరిట డబ్బుల వసూలు చేస్తున్నా..  కనీసం మెయింటెనెన్స్‌ చేయడం లేదని మండిపడుతున్నారు.  హాస్టల్ ఓపెన్ చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజుల కింద పెబ్బేరు చౌరస్తాలో ధర్నా కూడా నిర్వహించారు. అయినా అధికారుల నుంచి స్పందన రావడం లేదు. 

2014లో కాలేజీ ప్రారంభం

పెబ్బేరులో మహిళా పాలిటెక్నిక్​ కాలేజీ 2014లో ప్రారంభించగా.. మరో మూడేండ్లకు హాస్టల్‌ బిల్డింగ్‌ను కూడా నిర్మించారు.  కానీ, ఐదేండ్లవుతున్నా భవనాన్ని ఓపెన్‌ చేయడం లేదు.  కనీసం అందులో మౌలిక వసతులు కూడా కల్పించడం లేదు. ప్రతి ఏటా హాస్టల్​భవనాన్ని ఓపెన్​ చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  చేసేది లేక పెబ్బరులోనెలకు  రూ.3 వేల నుంచి రూ. 4 వేలు పెట్టి ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్లేందుకు బస్సులు, ఆటోలకు నెలకు మరో రూ. వెయ్యి వరకు ఖర్చవుతోంది.  

డెవలప్​మెంట్​ పేరిట డబ్బులు వసూలు

ప్రస్తుతం 250 మంది స్టూడెంట్లు చదువుతుండగా.. కాలేజీ డెవలప్‌మెంట్‌ ఫండ్​ పేరిట రూ. వెయ్యి, హరిత నిధి పేరిట మరో రూ.100 వసూలు చేస్తున్నారు. కానీ, డెవలప్‌మెంట్‌ కాదు కదా కనీసం స్వీపర్లను పెట్టి పరిసరాలను కూడా శుభ్రం చేయడం లేదు. దీంతో  పిచ్చిమొక్కలు పెరిగి పాములు, తేళ్లు వస్తున్నాయని స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   మొక్కల కోసం గుంతలు తీసినా.. మొక్కలు మాత్రం నాటలేదు. 

ప్రైవేట్‌‌లో చదువుతున్నట్లే ఉంది

హాస్టల్ వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నం.  ప్రైవేట్‌‌ హాస్టల్‌‌లో ఉంటున్నం.  హాస్టల్‌‌ ఫీజులతో పాటు బస్సు ఛార్జీలకు నెలకు రూ.5 వేలు అవుతున్నయి.  వీటికి తోడు డెవలప్‌‌ మెంట్‌‌, గ్రీనరీ అంటూ ఎక్స్‌‌ట్రా ఫీజులు వసూలు చేస్తున్నరు. పేరుకే గవర్నమెంట్ కాలేజీ అయినా ప్రైవేట్‌‌లో చదువుతున్నట్టే ఉంది. - పల్లవి, సెకండియర్, పెద్దమందడి, వనపర్తి 

ప్రభుత్వానికి విన్నవించినం

హాస్టల్‌ భవనాన్ని మాకు 2021లో హ్యాండోవర్​ చేశారు. కానీ ఓపెన్​ చేయాలని పైనుంచి ఆదేశాలు రాలేదు.  ఈ విషయమై చాలా సార్లు ఉన్నతాధికారులను అడిగినం. వాళ్లు అప్పుడు, ఇప్పుడూ అంటూ కాలం వెల్లదీస్తున్నరు.  రూల్స్‌ ప్రకారమే డెవలప్​మెంట్‌, హరిత నిధికి డబ్బులు తీసుకుంటున్నం. - రమేశ్​ కుమార్​, కాలేజీ ప్రిన్సిపాల్